- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీ కార్పొరేటర్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుట్ర..? తప్పుడు కేసుల్లో ఇరికిస్తూ..

దిశ, ఎల్బీనగర్: బీజేపీ కార్పొరేటర్ పై ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు బనాయిస్తూ కుట్ర చేస్తున్నారని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సిహ్మారెడ్డి ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్బీనగర్ డెవలప్మెంట్ మీడియా, భావన శ్రీనివాస్ గ్రూప్ ఆధారంగా టీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందిన కిరణ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విషయాలను ప్రస్తావిస్తూ.. కొన్ని పోస్టులు చేశారని తెలిపారు.
ప్రజా సంగ్రామ యాత్రలో గ్రేటర్ ఎన్నికల హామీలు 'బండి పోతే బండి, కారు పోతే కారు' అంటూ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చారా అని ప్రజలు ప్రశ్నించాలని పోస్ట్ పెట్టారని వివరించారు. దానికి సమాధానంగా పార్టీ మారిన సుధీర్ రెడ్డి ఆరు నెలల్లో రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తానని, మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీ ఏమైందని తాను ప్రశ్నించానని తెలిపారు.
అయితే దానికి బదులుగా పశ్చిమబెంగాల్‌లోని వీడియో పెట్టి ఇది బీజేపీ గుండాలు, రౌడీలు అని పోస్ట్ పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ పోస్టులకు జవాబుగా టీఆర్ఎస్ నాయకులు కూడా తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగిస్తున్నారని రిప్లై ఇవ్వడం జరిగిందని వివరించారు. అయితే టీఆర్ఎస్‌కు బదులు టీఎస్ అని పడిందని, దానిని వెంటనే డిలీట్ చేయడం జరిగిందని వివరించారు. దాని స్క్రీన్ షాట్ తీసుకొని వేరే విధంగా పోలీసు శాఖను అన్నట్టుగా తప్పుగా క్రియేట్ చేయడం జరిగిందన్నారు.
గత 25 సంవత్సరాల నుండి పోలీసు శాఖ వ్యవస్థ అంటే సంపూర్ణ గౌరవం తనకు ఉందని అన్ని విధాలుగా సహకరించానని స్పష్టం చేశారు. తన డివిజన్‌కు సంబంధించి మూడు పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని.. వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న అని తెలిపారు. కానీ, దాన్ని ఇంకో విధంగా కొందరు గిట్టని టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే ప్రోద్బలంతో తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులకు తాను భయపడనని, ఎమ్మెల్యే తాటాకు చప్పుళ్ళకు తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టిన కేసుల తీరును ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.