దశాబ్ధి ఉత్సవాల వేళ...ఉద్యోగులకు నిరాశ

by Disha Web Desk 15 |
దశాబ్ధి ఉత్సవాల వేళ...ఉద్యోగులకు నిరాశ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్న సందర్భంగా నూతనంగా నిర్మించిన సచివాలయంలో సీఎం కేసీఆర్ అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించారు. సచివాలయంలో జరిగే వేడుకలకు గ్రేటర్ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు హాజరుకావాలని, ఇందుకోసం నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి స్పెషల్ బస్సులను సైతం ఏర్పాటు చేస్తున్నామని ముందుగానే జీఏడీ నుండి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఉద్యోగులందరికీ సీఎం కేసీఆర్ తీపి కబురు చెబుతారని ఎదురు చూశారు.

అయితే ప్రభుత్వం నుండి ఉద్యోగులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించకపోగా అక్కడికి వెళ్లిన వారిని లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంతమాత్రం దానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడి వరకు ఎందుకు పిలిచారంటూ బహరంగ విమర్శలు చేశారు. పోలీసుల తీరుపట్ల మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2021 నాటి లెక్కల ప్రకారం 2,90,389 మంది ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. కాగా సంఘాలన్నింటికి పెద్దన్నగా ఉన్న ఓ ఉద్యోగ సంఘంపై ఇతర సంఘాలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని వత్తిడి పెంచుతున్నాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఇప్పుడు కాకపోతే సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుండి ప్రకటన రాదనే అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది.

పరిష్కారమెప్పుడో...?

దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై జూన్ 2 న సీఎం కేసీఆర్ ప్రకటన ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడ్డారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే పలు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ముఖ్యమంత్రి ఇలా నిరాశపరుస్తారని ఊహించలేదు. రాష్ట్రంలో పని చేస్తున్న 5544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు క్రమబద్దీకరించడం, వీఆర్ఏ, వీఆర్వో , జేపీఎస్ ల సమస్య ఇటీవలనే ఓ కొలిక్కి రావడంతో ఇదే తీరులో ఉద్యోగులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 3 పెండింగ్ డీఏలు , జూలై 1 నుండి వేయాల్సిన పే రివిజన్ కమిటీ , ఉద్యోగుల హెల్త్ కార్డులు , సీపీఎస్ రద్ధు , పెండింగ్ బిల్లులు, ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆలస్యంగా అందుతున్న వేతనాలు ఒకటవ తేదీననే అందేలా సీఎం నుండి ప్రకటన ఉంటుందని అంచనా వేశారు. అంతేకాకుండా పీఆర్సీ జీఓల విడుదలపై ప్రకటన పై ఆశలు పెట్టుకున్నఉద్యోగులు సీఎం తీరుపట్ల గుర్రుగా ఉన్నారు.

పోలీసులు సైతం....

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అవతరణ దినోత్సవం రోజున పోలీసు అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను అందజేసేవారు. అయితే ఈ యేడాది కూడా సేవా పతకాలు ఉంటాయని, దశాబ్ధి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండడంతో ఇవి మరింత ప్రోత్సాహం కల్పించేలా ఉంటాయని పోలీసులు సైతం భావించారు. అంతకుముందే పతకాలకు అర్హులైన అధికారులు, సిబ్బంది వివరాలు పోలీసు ఉన్నతాధికారులు సేకరించి జాబితా సిద్ధం చేశారు. అయితే వారి ఆశలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం నీరు పోసినట్లైంది.


Next Story