డబ్బు డ్రా కోసం ఏటీఎం సెంటర్​లకు వెళ్తున్నారా….ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త

by Kalyani |
డబ్బు డ్రా కోసం ఏటీఎం సెంటర్​లకు వెళ్తున్నారా….ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
X

దిశ, చార్మినార్​ : ఏటీఎం సెంటర్​లలో ఏటీఎం కార్డు ఉన్న వారి దృష్టి మళ్ళించి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా లోని ముగ్గురిని సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7.60లక్షల నగదు ను, 105 ఏటీఎం లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సౌత్​జోన్​ డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. సోమవారం పురాణి హవేలి లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ స్నేహ మెహ్రా, టాస్క్​ ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్ రావు​, ఫలక్​నుమా ఏసీపీ జావిద్​, సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ ఎస్​.రాఘవేంద్ర, బహదూర్​పురా ఇన్​స్పెక్టర్​ రఘునాథ్​లతో కలిసి వివరాలు వెల్లడించారు. పాతబస్తీకి చెందిన ఆతిఖ్యాఖాన్​ గత డిసెంబర్​ 22వ తేదీన బహదూర్​పురాలోని ఓ ఏటీఎం సెంటర్​లో డబ్బులు తీసుకోవడానికి వెళ్లింది. ఆమె ఏటీఎం సెంటరర్​లో కార్డు పెట్టి డబ్బులు విత్​ డ్రా చేయడానికి ప్రయత్నించింది.

అక్కడే కాపు కాసి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఇదే అదనుగా భావించి ఏటీఎం కార్డును బలవంతంగా లాక్కొని డబ్బులు తీసిస్తున్నట్లుగా బురిడీ కొట్టించారు. ఆమె పిన్​ నెంబర్​ తెలుసుకుని ఆమె ఏటీఎం కార్డు స్థానంలో అదే బ్యాంకుకు చెందిన మరో ఏటీఎంను ఆమె చేతిలో పెట్టి మరో ఏటీఎం సెంటర్​కు వెళ్లి డబ్బులు డ్రా చేశారు. వెంటనే రూ. 2.03లక్షలు డబ్బులు డ్రా అయినట్లుగా ఆతిఖ్యాఖాన్​ కు మెసేజ్​ రావడంతో తాను మోసపోయానని గ్రహించి కుటుంబ సభ్యులతో కలిసి బహదూర్​పురా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో నగర టాస్క్​ ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్​ రావు పర్యవేక్షణలో రంగంలోకి దిగిన సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్ ఎస్​.​ రాఘవేంద్ర బృందంతో పాటు బహదూర్​పురా పోలీసులు ఘటనా స్థలంలోని సి.సి కెమెరాలను పరిశీలించారు. చోరీకి పాల్పడింది హర్యానా రాష్ట్రానికి చెందిన వకిల్​ఆలీ (45)తో పాటు ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన ఫర్మాన్​(23), హైదరాబాద్​కు చెందిన ఓబైద్​ ఆరిఫ్​(30)లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించగా వారి వద్ద నుంచి రూ. 7.60లక్షల నగదుతో పాటు 105 ఏటీఎం కార్డులు, ఒక కారు, బైక్​, మూడు సెల్​ఫోన్లు, ఒక నకిలీ పోలీసు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

వకిల్​ఆలీ ,ఫర్మాన్​, ఓబైద్​ ఆరిఫ్ లను విచారించగా ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు వీరిపై తెలంగాణలో 10 కేసులు, ఆంధ్రప్రదేశ్​ లో 2 కేసులు, ఒడిషా లో 4 కేసులు , కర్ణాటకలో 2 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇది ఇలా ఉండగా హర్యానా రాష్ట్రానికి చెందిన వకిల్​ఆలీ, ఇస్లామ్​ లు ఇద్దరు బంధువులు. ఇస్లామ్​ హైదరాబాద్​ చార్మినార్​ ప్రాంతంలో క్లాత్​ వ్యాపారం చేశాడు. అప్పట్లో అతనికి గుల్లు, ఫర్మాన్​, ఓబేద్​ ఆరిఫ్​ లతో స్నేహం ఏర్పడింది. వారి సంపాదన విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో నగదు తీసుకునేందుకు ఏటీఎం కేంద్రాలకు వచ్చే అమాయకులను మోసం చేసి సులువుగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలలో ఏటీఎం సెంటర్​లలో ఏటీఎం కార్డులు ఉన్న వారి దృష్టిని మళ్లించి నేరాలకు పాల్పడుతున్నారు. మొదట వివిధ బ్యాంకులకు సంబంధించిన పలు ఏటీఎం కార్డులను సేకరించారు.

అనంతరం నిరక్షరాస్యులు, సీనియర్‌ సిటిజన్లు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం సెంటర్లలో డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించగా నిందితులు ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డ్రా చేసుకునేందుకు సాయం పేరుతో వారి వద్దకు వస్తారు. సగటున నిందితుల్లో ఒకరు ఏటిఎం పిన్‌ను గ్రహించి, కార్డ్ హోల్డర్ దృష్టిని మళ్లించడం ద్వారా అసలు ఏటిఎం కార్డ్‌ని మరొక సారూప్య కార్డ్‌తో భర్తీ చేస్తారు. వెంటనే వారు అసలు ఏటీఎం కార్డ్‌తో అక్కడి నుండి తప్పించుకుని, మరో ఏటీఎం సెంటర్​కు వెళ్లి డబ్బును విత్​ డ్రా చేస్తారని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. వకిలీఆలీ, ఫర్మాన్​, ఒబేద్​ ఆరిఫ్​, ఇస్లామ్​, గుల్లు లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎం సెంటర్​లలో దోపిడీలకు పాల్పడుతున్నారని, అందులో వకిలీఆలీ, ఫర్మాన్​, ఒబేద్​ ఆరిఫ్​ లను ఇప్పటికే అరెస్ట్​ చేయగా, మరో ఇద్దరు ఇస్లామ్​, గుల్లులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును బహదూర్​పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed