అన్వర్ ఉలూమ్ కళాశాలను వ‌క్ఫ్‌ బోర్డ్ తక్షణమే స్వాధీనం చేసుకోవాలి - సీపీఎం డిమాండ్

by srinivas |
అన్వర్ ఉలూమ్ కళాశాలను వ‌క్ఫ్‌ బోర్డ్ తక్షణమే స్వాధీనం చేసుకోవాలి - సీపీఎం డిమాండ్
X

దిశ, ముషీరాబాద్ : హైదరాబాద్ మల్లేపల్లిలోని అన్వర్ ఉలూమ్ కళాశాలను వ‌క్ఫ్‌ బోర్డ్ తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సిపిఎం న‌గ‌ర క‌మిటీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం ముషీరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్‌లోని సీపీఎం న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆ పార్టీ న‌గ‌ర కార్య‌ద‌ర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడారు. మల్లెపల్లి చౌరస్తాలోని అన్వర్ ఉలూమ్ కళాశాలను 1955 లోనే ప్రభుత్వం వ‌క్ఫ్‌గా రిజిస్టర్ చేసింద‌ని, సర్వే కమిషనర్ సర్వే చేసి 3 ఎకరాల స్థలంలో ఉన్న అన్వర్ ఉలూమ్ కళాశాలను, దానికి అనుబంధంగా ఉన్న 22 దుకాణాలను 1984లో నోటిఫై చేసి గెజిట్ ప్రచురించిందన్నారు.

కానీ అన్వర్ ఉలూమ్ కళాశాల ఎడ్యుకేషనల్ అసోసియేషన్ సెక్రటరీ గా చలామణి అవుతున్న వ్యక్తి కళాశాలను తన సొంత ఆస్తిగా మార్చుకొని అనేక విద్యాసంస్థలను నడిపిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడని ఆరోపించారు. వ‌క్ఫ్‌ ఆస్తిని కబ్జా చేసి అనేక అక్రమాలకు పాల్పడుతూ, వందల కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్న అన్వర్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ సెక్రటరీ పై విచారణ జరిపి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు.

అన్వర్ ఉలూమ్ కళాశాల యాజమాన్యం వ‌క్ఫ్ బోర్డ్ ఆదేశాలను అమలు చేయడం లేదని, వ‌క్ఫ్‌ బోర్డుకు అకౌంట్స్ వివరాలు తెలియజేయడం లేదు, బడ్జెట్ ప్రతిపాదనలు పంపడం లేదన్నారు. ప్రతి ఏటా చెల్లించాల్సిన వ‌క్ఫ్ ఫండ్ చెల్లించడం లేదని తెలిపారు. వక్ఫ్ బోర్డుకు అనుమతి లేకుండా మేనేజింగ్ కమిటీని ఇష్టారాజ్యంగా మార్చేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్నదని విమ‌ర్శించారు. కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు గతంలోనే అన్వర్ ఉలూం కళాశాల సెక్రటరీ పై సీసీఎస్ లో క్రిమినల్ కేసు నమోదయిందని గుర్తు చేశారు.

వ‌క్ఫ్ బోర్డు ఇచ్చే నోటీసులను ఖాతర్ చేయకుండా, నిరంతరంగా న్యాయపరమైన లిటిగేషన్స్ వేస్తూ కళాశాలపై కబ్జా కొనసాగిస్తున్నాడని అన్నారు. మల్లేపల్లి లోని ప్రముఖ ఏరియాలో దాదాపు రూ.200 కోట్ల విలువైన మూడు ఎకరాల వ‌క్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించుకొని, అనేక విద్యాసంస్థలను వ్యాపారంగా మార్చుకొని కోట్లాది రూపాయలు దండుకుంటున్నాడన్నారు. ఈ కళాశాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, విద్యాసంస్థల అసోసియేషన్ సెక్రటరీ పేరుతో చేస్తున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story