ఇక పక్కాగా రోడ్ల నాణ్యత.. అవకతవకలకు చెక్ పెట్టేందుకు చర్యలు

by Aamani |
ఇక పక్కాగా రోడ్ల నాణ్యత.. అవకతవకలకు చెక్ పెట్టేందుకు చర్యలు
X

దిశ, సిటీ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల నిర్వహణ అంటే నాణ్యత లేమి, అవినీతి, గుంతలు, గోతులు అనే పేరుంది. కానీ వీటన్నింటికి చెక్ పెట్టేందుకు బల్దియా ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. రోడ్ల నిర్వహణ, క్వాలిటీపై దృష్టి సారించింది. ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగకుండా క్వాలిటీ మెయింటెన్ చేయాలని నిర్ణయించింది. అందుకు క్వాలిటీ చెక్ చేసేందుకు జాతీయ స్థాయిలో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫక్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లాబొరేటరీస్(ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన ఏడు ల్యాబ్స్ , 15 ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుంది. థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ రిపోర్టు ఆధారంగానే బిల్లులు చెల్లించే అవకాశముందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

గ్రేటర్ పరిధిలో 9013 కిలోమీటర్ల రోడ్లు..

జీహెచ్ఎంసీ పరిధిలో 9013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వీటిలో 2846 కిలోమీటర్ల బ్లాక్ టాప్ (బీటీ) రోడ్లు, 6167 సిమెంట్ రోడ్లు(సీసీ రోడ్లు) కలవు. ఈ రోడ్లలో 526 కిలో మీటర్ల రోడ్లు 4 లైన్లు , ఆ పైన లైన్ల రోడ్లు కలవు. ఈ నేపథ్యంలో 9013 కిలో మీటర్ల ప్రధాన బీటీ రోడ్లలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) పథకం ద్వారా 811 కిలోమీటర్ల ప్రజా రవాణా మెరుగుపడే ప్రధాన రోడ్డును రూ. 1839 కోట్ల అంచనా వ్యయంతో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఐదేండ్ల సమయం ముగియనుండడంతో మరోసారి 1100కిలోమీటర్లకు పెంచి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ఏజెన్సీలు ఫుట్ పాత్, సెంట్రల్ డివైడర్లు, నిర్మాణాలు, కర్బ్ పెయింటింగ్, లైన్ మార్కింగ్, గ్రీనరీ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది.

క్వాలిటీ చెకింగ్ ఇలా..

గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ల నిర్వహణ, కొత్తగా బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం తర్వాత జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెక్ చేస్తారు. అంటే కాంట్రాక్టర్లు ఫస్ట్ పార్టీ అయితే జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ సెకండ్ పార్టీ చెకింగ్ చేయనుంది. థర్డ్ పార్టీగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఫోర్త్ పార్టీగా ఎన్ఏబీఎల్ ల్యాబ్స్ ఉంటాయి. మూడు దశల్లో చెక్ చేసిన తర్వాతనే బిల్లులు విడుదల చేయనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.

థర్డ్, ఫోర్త్ పార్టీ ఏజెన్సీలు..

క్వాలిటీ చెక్ చేయడానికి 7 ల్యాబ్స్, 15 ఇంజనీరింగ్ కాలేజీలతో జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫక్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లాబోరేటరీస్(ఎన్ఏబీఎల్) గుర్తింపు స్టేడెంట్ టెక్, మంగలం, షీకాక్స్, ఎస్కే కన్సల్టెంట్స్, ఈస్కీ, సుపీరియర్, స్టాండర్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. వీటితో పాటు జేఎన్టీయూ, వీఎన్ఆర్ విజ్జాన్ భారతి, మల్లారెడ్డి, మెథడిస్ట్, సీబీఐటీ, జీఆర్ఈటీ, వర్ధమాన్, ఇంజినీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈస్కీ) ఇలా 15 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.

వర్క్ బిల్లులో 0.3శాతం..

రోడ్ల క్వాలిటీ చెక్ చేయడానికి ఏజెన్సీకి వర్క్ బిల్లులో 0.3శాతం చెల్లించనున్నారు. రూ.50 లక్షల బిల్లుకు రూ.15వేలు కానుంది. రూ.50 లక్షల బిల్లు వరకు మూడు శాంపిల్స్, ఒక ల్యాబ్ చెకింగ్ ఉంటుంది. రూ.2 కోట్ల వరకు ఐదు శాంపిల్స్, రూ.2కోట్ల పైన ఉంటే ప్రతి కోటి రూపాయలకు ఒక శాంపిల్ చొప్పున పెరుగుతుంది. అయితే జీహెచ్ఎంసీలో రూ.50 లక్షల నిధులు మంజూరు చేయడానికి కమిషనర్ కు అధికారం ఉంది. స్టాండింగ్ కమిటీకి రూ.2కోట్లు, జనలర్ బాడీకి రూ.5 కోట్ల వరకు మంజూరు ఇచ్చే అధికారం ఉంది. రూ.5 కోట్ల పైన ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed