ముగిసిన త్రైమాసికంలో బ్యాంకులలో రూ. 2073 కోట్ల డిపాజిట్లు తగ్గాయి: అమిత్ జింగ్రాన్

by Seetharam |
ముగిసిన త్రైమాసికంలో బ్యాంకులలో రూ. 2073 కోట్ల డిపాజిట్లు తగ్గాయి: అమిత్ జింగ్రాన్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు రూ. 2073 కోట్ల మేర తగ్గాయని ఎస్‌బీఐ సీజీఎం, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్ బీసీ) అధ్యక్షుడు అమిత్ జింగ్రాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గత త్రైమాసికంలో బ్యాంకుల పనితీరును సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తన 34వ త్రైమాసిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అమిత్ జింగ్రాన్ బ్యాంకుల త్రైమాసిక లావాదేవీలను వివరించారు. బ్యాంకులలో మొత్తం డిపాజిట్లు రూ 6,30,451.27 కోట్లు ఉన్నాయన్నారు.

గత త్రైమాసికంలో మొత్తం అడ్వాన్స్‌లు రూ. 22,182 కోట్లు తగ్గాయని చెప్పారు. అయితే సీడీ నిష్పత్తి 100 శాతం పైన కొనసాగుతోందని, ఈ యేడాది జూన్ 30వ తేదీ నాటికి 112.64 గా ఉందన్నారు. ప్రస్తుత ఆర్ధిక మొదటి త్రైమాసికంలో ఖరీఫ్ కింద బ్యాంకులు రూ. 9,771.96 కోట్ల స్వల్పకాలిక ఉత్పత్తి రుణాలను పంపిణీ చేశాయన్నారు. అంతేకాకుండా బ్యాంకులన్నీ కలిపి రూ. 22,298.55 కోట్లను మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) కింద పంపిణీ చేయడం ద్వారా వార్షిక లక్ష్యాలలో 45.59 శాతాన్ని సాధించడం జరిగిందన్నారు.

ప్రధాని ముద్రా యోజన కింద వార్షిక లక్ష్యాలలో 12.37 శాతం సాధించడం ద్వారా వార్షిక లక్ష్యం రూ. 8,872 కోట్లకు గాను బ్యాంకులు రూ. 1097.91 కోట్లు పంపిణీ చేశాయని అమిత్ జింగ్రాన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె నిఖిల, నాబార్డ్ సీజీఎం, చింతల సుశీల, ఎస్ ఎల్ బీ సీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర, ఇతర పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకులు, పలు ప్రభుత్వ శాఖల అధిపతులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed