నగర దారులన్నీ మునుగోడు వైపే

by Seetharam |   ( Updated:2022-10-10 12:09:06.0  )
నగర దారులన్నీ మునుగోడు వైపే
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలన్నీ మునుగోడు ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతుండగా ప్రధాన పార్టీలకు చెందిన హైదరాబాద్ నేతలు మునుగోడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కంకణం కట్టుకున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఎన్నికలు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. ఉప ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ పవర్ తగ్గలేదని నిరూపించుకోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ, ఎలాగైనా హుజూరాబాద్ ఫలితం పునరావృతం చేయాలని బీజేపీ, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలు ఆరాటపడుతుండగా ఈ ఎన్నికను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అగ్రనాయకులను బరిలోకి దించి హోరాహొరిగా ప్రచారం కొనసాగిస్తుండగా.. అన్ని పార్టీలకు చెందిన చోటా మోటా నాయకులు కూడా అగ్ర నాయకత్వాన్ని అనుసరిస్తున్నారు. ఇదిలా ఉండగా నగరంలో ఉద్యోగులు, వ్యాపారులు, నాయకులు, చివరకు కార్మికులు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికపై జోరుగా చర్చలు సాగిస్తున్నారు. టీ బండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఇలా ఎక్కడ నలుగురు గుమికూడినా బై పోల్‌లో ఎవరు గెలుస్తారు ? అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది.

ఉదయం మునుగోడుకు- రాత్రి నగరానికి..?

హైదరాబాద్‌లో నివాసముంటున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లే కాకుండా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఉదయం మునుగోడు నియోజకవర్గానికి చేరుకుని ప్రచార హోరును కొనసాగిస్తున్నారు. అనంతరం రాత్రి వరకు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి కేవలం వంద కిలోమీటర్ల లోపే మునుగోడు నియోజకవర్గం ఉండడం, ప్రయాణం కూడా రెండు గంటలకు మించి పట్టకపోవడంతో ఆయా పార్టీల నేతలకు ప్రచారం సులువుగా మారింది. దీంతో పగలు సమయంలో ప్రధాన నాయకులెవరూ నగరంలో అందుబాటులో ఉండడం లేదు.

నగరంలోనూ జోరందుకున్న మద్యం అమ్మకాలు..

మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం హైదరాబాద్ నగరంపై కూడా పడింది. నగరానికి అతి సమీపంలో ఈ నియోజకవర్గం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలంతా రాత్రి వరకు హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నగరం నుండి మద్యం, నగదు తరలింపుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులను రాత్రి సమయానికి నగరానికి పిలిపించుకుని విందు, వినోదాలు ఏర్పాటు చేసి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో నగరంలో కూడా మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి.

నగర ప్రజలలో పెరిగిన ఆసక్తి..

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నవంబర్ 3వ తేదీన జరుగనున్న మునుగోడు బై పోల్ అటు రాజకీయ నాయకులనే కాకుండా నగర ప్రజలను కూడా ఆకర్షిస్తోంది. దీంతో ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికలపై చర్చలే వినబడుతున్నాయి. ఎన్నికలలో ఎవరు గెలుస్తారు ? టీఆర్ఎస్ ప్రతిష్ట తగ్గిందా ? ఉప ఎన్నికలను వరుసగా గెలుస్తూ వస్తున్న బీజేపీ ఖాతాలో ఈ నియోజకవర్గం కూడా చేరుతుందా ? సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా ? అనే చర్చలు గ్రేటర్ వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ఈ ఉప ఎన్నిక గురించే మాట్లాడుతుండడం కనబడుతోంది.

Next Story

Most Viewed