- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నగరంలో సెటిలైన మునుగోడు ఓటర్లకు ఫోన్ కాల్స్‌తో చికాకు..

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికలు సాధారణ ఓటర్లకు చికాకును తెప్పిస్తున్నాయి. నవంబర్ 3వ తేదీన నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు ఫోన్‌లు చేసి, మా పార్టీకే ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇది రోజులో ఒకటి రెండు కాల్స్‌కు పరిమితమైతే సమస్యేమి కాదు. ప్రతి అర్ధగంటకు ఒకసారి ఏదో ఒక పార్టీకి చెందిన కాల్స్ వస్తుండడంతో ప్రయాణంలో ఉన్నవారు, కార్యాలయాలలో డ్యూటీలలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఫోన్ కట్ చేస్తే తిరిగి స్వల్ప వ్యవధిలోనే కాల్స్ వస్తుండడంతో ఓటర్లలో అసహనం పెరిగిపోతోంది.
గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం..?
మునుగోడు నియోజకవర్గంలో సుమారు 2.40 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో సుమారు 40 వేల వరకు ఓటర్లు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల నివాసముంటున్నారు. వీరి ఓట్లు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో బరిలో ఉన్న ప్రధాన పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి ఓట్లు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మునుగోడు నియోజకవర్గంలోనే కాకుండా నగరంలోని ఒక్కో ప్రాంతానికి ఇంచార్జ్‌లను నియమించి వారితో ఓటర్లను రాబట్టుకునేలా చూస్తున్నారు.
ఆకర్షించే ప్రయత్నం..
జీహెచ్ఎంసీలో సెటిలైన మునుగోడు ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ ప్రయత్నాలు వదలడం లేదు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ముందుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వంటి వారే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్‌లు ఇతర ప్రజా ప్రతినిధులను ఉపయోగించుకుని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లలో విందులు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సందర్భంగా తమ అభ్యర్థికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే రోజున నగరం నుండి వాహన సౌకర్యం సైతం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నాయి.
ఇందుకు గాను తమ పార్టీకి చెందిన కొందరు నేతల ఫోన్ నెంబర్లు ఇచ్చి ఓటర్లతో వెళ్లే వాహనం ఎక్కడి నుండి బయలు దేరుతుందో చెబుతున్నారు. వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. బీజేపీ నేతలు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా నగరంలోని మునుగోడు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఫోన్‌లో కాల్స్, సాధారణ మెసేజ్ లే కాకుండా విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి తాయిలాలు ఇస్తామని చెప్పి ప్రలోభ పెడుతున్నారు.
మంత్రుల కాన్ఫరెన్స్..
సాధారణంగా ఓ మంత్రి అపాయింట్ మెంట్ కావాలంటే సాధారణ ప్రజలకు ఎంత ఇబ్బందో తెలియంది కాదు. మంత్రి పేషికి వెళ్లినా వారు తీరిక లేకుండా ఉన్నామని తిప్పి పంపుతుండడం చూస్తుంటాం. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం మునుగోడు నియోజకవర్గానికి మంత్రులను ఇంచార్జ్‌లుగా నియమించింది. వీరు తమకు కేటాయించిన ప్రాంతాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే మరో వైపు ఓటర్ల ఫోన్ నెంబర్లను సేకరించి వారితో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి మంత్రులు ఓటర్లను ఫోన్ కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని వారితో మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఓట్ల కోసం ఇలా పార్టీల నాయకులు పడుతున్న పాట్లను ఓటర్లు నిశీతంగా గమనిస్తున్నారు.