అందరి చూపు... బాలాపూర్​ ​లడ్డూ వేలం పాట వైపే

by Kalyani |
అందరి చూపు... బాలాపూర్​ ​లడ్డూ వేలం పాట వైపే
X

దిశ, బడంగ్​పేట్​ : హైదరాబాద్ లో కదిలే తొలి వినాయకుడు ... బాలాపూర్ గణపతి నిమజ్జన నీరాజన వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. 44 వసంతాల బాలాపూర్​ గణేష్​ వార్షికోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాలు,2024 బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో 31వ సారి బాలాపూర్​ లడ్డూ ఎవరికి సొంతం కానుందో .. మరికొన్ని గంటల్లో భవితవ్యం తేలనుంది. 2023లో రూ.27 లక్షలుకు దాసరి దయానంద్​ రెడ్డి సొంతం చేసుకున్నారు. కాగా ఈ యేడు జరుగనున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఎంతో ఆసక్తి రేకెత్తించనుంది. ఈ సారి లడ్డు వేలం పాటకు ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఒక్కొక్కరు రూ.5వేలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి లడ్డూ వేలం పాటలో బాలాపూర్​ గ్రామస్థులు కూడా ముందుగానే డిపాజిట్​ చేశాక లడ్డూ వేలం పాట పాల్గొనడానికి అర్హులని కొత్త రూల్​ తీసుకువచ్చిన విషయం విధితమే.

గత సంవత్సరం 2023 జరిగిన వేలం పాటలో మొత్తాన్ని రూ. 27 లక్షల రూపాయలను డిపాజిట్ గా చూపిస్తేనే వేలం పాట పాడడానికి అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో చివరగా సోమవారం సాయంత్రం 6గంటల వరకు రూ.27లక్షల డిపాజిట్​ చెల్లించిన వారికే లడ్డూ వేలం పాట పాల్గొనడానికి అర్హులని బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్ళెం నిరంజన్​ రెడ్డి తెలిపారు. గత పది రోజులుగా ప్రతి రోజు బాలాపూర్​ గణపతిని 30 నుంచి 40 వేల మంది దర్శించుకుంటే సెలవుదినాల్లో మాత్రం 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఈ యేడు ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా భక్తులు బాలాపూర్​ గణపతిని దర్శించుకున్నారు.

బాలాపూర్ గ్రామ పురవీధుల గుండా కొనసాగనున్న గణపతి ఊరేగింపు....

44 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన బాలాపూర్​ గణపతి నిమజ్జన వేడుకలు మంగళవారం ప్రారంభం కానుంది. తెల్లవారుజామున 5 గంటలకు బాలాపూర్​ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి బాలాపూర్​ పురవీధుల గుండా అత్యంత భక్తి శ్రద్దలతో భజన చేస్తూ .. సన్నాయి మేళాల నడుమ బాలాపూర్​ గణపతిని ఊరేగిస్తారు. బాలాపూర్​ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి సాక పెట్టి , కొబ్బరికాయ కొట్టి, మంగళ హారతులు పడతారు. 9 గంటలకు బాలాపూర్​ గణపతి డీసీఎం వ్యాన్​లో బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. ఉదయం 9.30 గంటలకు బాలాపూర్​ గణేష్​ లడ్డూ వేలం పాట అట్టహాసంగా ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు వేలం పాటలో పోటా పోటీగా పాడడం కనబడుతుంది. గత ఏడాది లడ్డూను సొంతం చేసుకున్న డబ్బులు చెల్లించిన దాసరి దయానంద్​ రెడ్డిని బంగారు గొలుసుతో ఘనంగా సత్కరించనున్నారు.

బాలాపూర్​ గణేష్​​ శోభాయాత్ర లో భారీ పోలీసు​ బందోబస్తు....

మంగళవారం జరగనున్న బాలాపూర్​ గణేష్​ నిమజ్జన శోభ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. బాలాపూర్​ గణేష్​ శోభాయాత్ర వెంట ఒక డీసీపీ, ఒక అడిషనల్​ డీసీపీ, నలుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 26 మంది ఎస్​ఐలు, 208 మంది పోలీసు సిబ్బందితో పాటు రాపిడ్​యాక్షన్​ ఫోర్స్​తో పాటు పారామిలటరీ బలగాలు, స్పెషల్​ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారన్నారు. 30 సి.సి కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తామన్నారు.

Advertisement

Next Story