క్రికెట్ బెట్టింగ్ లో నష్టపోయి...గంజాయి దందా లోకి...

by Kalyani |
క్రికెట్ బెట్టింగ్ లో నష్టపోయి...గంజాయి దందా లోకి...
X

దిశ, సిటీక్రైం : క్రికెట్ బెట్టింగ్ లో ఆర్థికంగా నష్టపోయిన యువకుడు గంజాయి దందాకు స్కెచ్ వేశాడు. ఈ దందాలో తనకు సహకరిస్తే ప్రాఫిట్ షేరింగ్ ఇస్తానని మరొక యువకుడిని గంజాయి స్మగ్లింగ్ లోకి దించాడు. ఈ ఇద్దరీ నుంచి గంజాయి కొనుగోలు చేసినందుకు మరో ఇద్దరు విద్యార్థులు పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు యువకులను గంజాయి తరలిస్తుండగా అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం... సూర్యపేట్ జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందిన టి.అఖిల్ కుమార్ (23) హైదరాబాద్ మీర్ పేట్ లో నివాసం ఉంటున్నాడు. అతను క్రికెట్ బెట్టింగ్, సిగరేట్, గంజాయి తాగడం వంటి వ్యసనాలకు బానిసై ఆర్థికంగా నష్టపోయాడు. వాటిని అధిగమించేందుకు గంజాయి దందాను చేస్తున్నాడు.

దీని కోసం కొద్ది రోజులు మంగళహాట్ ప్రాంతం నుంచి గంజాయి ప్యాకెట్ లను తీసుకువచ్చి మీర్ పేట్ ప్రాంతంలో విద్యార్ధులకు అమ్మడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అరకు లోని జెన్ను నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి అధిక ధరలో విక్రయిస్తూ డబ్బును సంపాదిస్తున్నాడు. ఇలా అతనికి పరిచయమైన ఎం. రాకేష్ (24) ను ఈ గంజాయి స్మగ్లింగ్ లో సహకరిస్తే లాభాల్లో షేర్ ఇస్తానని అతనిని కూడా ఈ దందాలో దింపాడు. ఇలా అరుగు నుంచి 6 కేజీల గంజాయిని తీసుకువచ్చి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఈ ఇద్దరు యువకుల నుంచి గంజాయిని కొని సేవిస్తున్న ఎన్ స్వరూప్(25), బి.సాయినాధ్ రెడ్డి(20) విద్యార్ధులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Next Story