అమరులు ఎంతమంది? సర్కారు సాయం కొంతమందికే!

by Rajesh |
అమరులు ఎంతమంది? సర్కారు సాయం కొంతమందికే!
X

వీరులారా.. వందనం అంటూ తెలంగాణ జాతి అమరులను తలుచుకుంటున్నది. ప్రతి సందర్భంలోనూ వారి త్యాగాలను నెమరేసుకుంటున్నది. వారి బలిదానాల పునాదులపైనే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందని కొనియాడుతుంటారు. కానీ, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. బలిదానం చేసుకున్న వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి. వారికి తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందాయా? అసలు అమరులైన వారందరినీ గుర్తించారా? అంటే లేదనే చెప్పాలి.

2014, జూన్​14న అసెంబ్లీలో 1200 మంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు బలి తీసుకున్నారని సీఎం కేసీఆర్​స్వయంగా తీర్మానం చేశారు. కానీ, 2014 అక్టోబర్‌లో విడుదల చేసిన అమరవీరుల జాబితాలో 459 మందిని, ఆ తర్వాత 2020 వరకు విడుదల చేసిన 23 జీవోల్లో మరో 126 మందిని ప్రభుత్వం గుర్తించింది. మొత్తంగా 585మంది అమరులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మరి మిగతా 615 మంది మాటేమిటి? అసలు సీఎం చెబుతున్న సంఖ్య కన్నా ఎక్కువమందే ప్రాణాలు తీసుకున్నారని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమరుల కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం, రూ.10 లక్షలు, వ్యవసాయం చేసుకునేవారికి సాగుకు యోగ్యమైన భూమిని ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. కొందరికి రూ.10 లక్షలు, మరొకొందరికి ఉద్యోగాలు ఇచ్చినా.. భూమి, ఇండ్లు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. మిగిలిన అమరులను తక్షణమే గుర్తించాలని, మార్టిర్స్​వెల్ఫేర్​బోర్డు ప్రకటించాలని, స్వాతంత్ర్య సమరయోధులకు కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని అమరవీరుల ఐక్య వేదిక డిమాండ్​చేస్తున్నది. - దిశ, తెలంగాణ బ్యూరో

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నుంచి జరిగిన మలి దశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినవారెంతమంది?.. ప్రభుత్వం గుర్తించింది ఎందరిని?.. ఆర్థిక సాయం అందింది ఎంతమందికి?.. ప్రభుత్వం జారీచేసిన జీవోలోని అంశాలన్నింటినీ అమలుచేసిందా?.. అమరవీరుల స్మారకచిహ్నం లాంఛన ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఎంతమందిని ఆహ్వానిస్తున్నది?.. ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి. గడచిన తొమ్మిదేళ్ళలో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇప్పటికీ అనేక కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయని, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయని బాధిత కుటుంబాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

మేనిఫెస్టోలో హామీ

అమరవీరుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ అధినేత 2014 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనే క్లారిటీ ఇచ్చారు. ‘అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి కోసం విలువైన ప్రాణాలనే ఇచ్చారు. వారి త్యాగాలను ఉజ్వలంగా స్మరించుకోవాలి. బిడ్డలను కోల్పోయిన కుటుంబాల సంక్షేమ బాధ్యతను విధిగా తెలంగాణ ప్రభుత్వమే స్వీకరిస్తుంది. ఈ కుటుంబాలకు గృహవసతి కల్పిస్తుంది. వీరి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుంది.

వ్యవసాయం మీద ఆధారపడే అమరుల కుటుంబాలకు సాగు యోగ్యమైన భూమిని ఇస్తుంది.’ అని ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా అమరుల త్యాగం, వారి కుటుంబాల వెల్ఫేర్ గురించి 2014 జూన్‌లోనే స్పష్టత ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీగా ఉద్యమం సమయంలో అమరుల త్యాగాలను వాడుకున్నదని, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ విస్మరించారని ఉద్యమకారులు ఆరోపించారు.

ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అమరవీరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు అటు పార్టీపరంగా కూడా తగిన అవకాశాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడే రాష్ట్ర పాలకుడయ్యారంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం ఎలా ఉన్నా ‘మాది ఫక్తు రాజకీయ పార్టీ’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. అమరవీరుల స్మారకచిహ్నం ఓపెనింగ్‌కు ఆ కుటుంబాలను ఆహ్వానించకపోవడాన్ని ఎత్తిచూపారు. తక్షణం నాలుగు అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

నాలుగు రకాల చిక్కులు

రాష్ట్రం కోసం చనిపోయిన అమరుల్లో కొన్ని కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందింది. ఇంకొన్ని ఫ్యామిలీస్‌కి సర్కారు కొలువు వచ్చింది. వీటికి నోచుకోలేకపోయిన కుటుంబాలు మరికొన్ని ఉన్నాయి. కనీసం గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయామనే కుటుంబాలు కూడా ఉన్నాయి. అమరుల కుటుంబాల్లో కనిపిస్తున్న కొన్ని ఘర్షణలు, వివాదాలు...

ప్రభుత్వ ఉద్యోగం పొందిన మా కొడుకు వృద్ధాప్యంలో ఉన్న మమ్మల్ని సరిగా చూసుకోవడంలేదు. ముసలి వయసులో మేం ఎక్కడకు పోవాలి? మమ్మల్ని పట్టించుకునేదెవరు? మా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుంటుంది.

రాష్ట్రం కోసం 1200 మందికి పైగా చనిపోయారు. కానీ చాలా మందిని ప్రభుత్వం గుర్తించలేదు. తగిన ఆధారాలు, ఎఫ్ఐఆర్ లాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో ఈ చిక్కులు వస్తున్నాయి. ‘జెన్యూన్’ కాదు.. అనే పేరుతో లిస్టులోకి ఎక్కలేదు. చాలా మంది పేర్లు మిస్సింగ్‌గా మిగిలిపోయాయి.

ఆత్మహత్యాయత్నం చేసి బతికిపోయిన యువత బాధలు మరో రకం. ప్రస్తుతం ఏదో ఒకరకంగా బతుకుతున్నా అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల సాయం కొంతమందికి అందినా జీవితాంతం ట్రీమ్‌మెంట్, మెడికల్ అవసరాలు ఆర్థికంగా వారికి మోయలేని భారంగా మారింది. వీరి సంక్షేమాన్ని కూడా ప్రభుత్వమే పట్టించుకోవాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ర్యాలీల్లో, నిరాహారదీక్షా శిబిరాల్లో కుప్పకూలి చనిపోయారు. గుండెపోటు లాంటివి కారణం. వీరిని అమరవీరులుగా ప్రభుత్వం గుర్తించడంలేదు. అనారోగ్యం, సహజ మరణాలు అని ముద్రపడ్డాయి. ఈ కుటుంబాలు కూడా ప్రభుత్వం నుంచి వేరే రూపంలో సాయాన్ని ఆశిస్తున్నాయి.

అమరుల సంక్షేమ బోర్డుకు డిమాండ్

తెలంగాణ కోసం కొట్లాడి చనిపోయిన అమరుల కుటుంబాలను ఆదుకోడానికి ప్రభుత్వం తరఫున ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి తెరమీదకు వచ్చింది. అప్పట్లో సూసైడ్ ఎటెంప్ట్ చేసి ఇప్పుడు చిన్నా చితకా పనులు చేసుకుంటున్న యువత మానసికంగా కుంగిపోవడంతో కుటుంబ సభ్యులు మరో రూపంలో ఆ బాధలను అనుభవిస్తున్నారు. ఆర్థిక సాయం, ఉద్యోగం ఇవ్వడం మాత్రమే సంపూర్ణ పరిష్కారం కాదని, ఆ కుటుంబాల అవసరాలను గుర్తించి ఆదుకునే దిశగా ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అమరవీరుల ఐక్య వేదిక ప్రభుత్వానికి సూచిస్తున్నది. ఈ బాధలు అనుభవిస్తున్నవారిలో ఎక్కువ కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలకు చెందినవారేనని, ఆర్థికంగా పేదరికంలో ఉన్నవేనని వేదిక గుర్తుచేసింది.

అమరుల గుర్తింపు కోసం కమిటీ

సుమారు 1200 మందికి పైగా రాష్ట్రం కోసం అమరులైతే ప్రభుత్వం అందరినీ గుర్తించలేదని విపక్షాల ప్రతినిధులు పలు సందర్భాల్లో గుర్తుచేశారు. అందరికీ ప్రభుత్వం నుంచి సాయం అందిందని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. అమరవీరులను గుర్తించడానికి ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఐక్య వేదిక అధ్యక్షుడు నరేశ్​ నాయక్ సూచించారు. ఎఫ్ఐఆర్ లాంటి లీగల్ చిక్కులతో సంబంధం లేకుండా అప్పటి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని సంఘటన ఆధారంగా గుర్తింపు ప్రక్రియ జరగాలన్నారు. అమరులను ఆదుకుంటామంటూ ప్రభుత్వమే స్వచ్ఛందంగా ప్రకటించినందున ఇప్పటివరకు సాయం అందుకోని, అమరవీరుల జాబితాలో చేరని కుటుంబాల వివరాలను క్రోడీకరించాలని కోరారు.

జీవోలో ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి?

రాష్ట్ర ప్రభుత్వం 2016 మే 23న జారీచేసిన జీవోలో నాలుగు అంశాలను పేర్కొన్నది. అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబ సభ్యుల్లో అర్హత కలిగినవారికి ఉద్యోగం, వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలకు సాగుకు యోగ్యమైన భూమి పంపిణీ, గృహవసతి లేనివారికి ఆ సౌకర్యాన్ని కల్పించడం, కుటుంబానికి ఉచితంగా విద్య, వైద్యం అందించడం.. తదితర హామీలను ఇచ్చింది. సర్వీస్ రూల్స్ నిబంధనలతో వచ్చే చిక్కులకు పరిష్కారంగా వయసు, విద్యార్హత లాంటి అంశాల్లో ప్రత్యేక సడలింపులు ఇచ్చింది. జిల్లా కలెక్టర్లకే సంపూర్ణ అధికారాలు ఇచ్చి వారికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వాలని ఆ జీవోలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టత ఇచ్చారు. ఒకవేళ పోస్టులు లేనట్లయితే అదనంగా క్రియేట్ చేయాలని నొక్కిచెప్పారు.

మొత్తం 585 మందికి సాయం

ఫస్ట్ లిస్టులో 459 మందికి సాయం చేస్తూ ప్రభుత్వం 2014 అక్టోబరు 27న జీవో (నెం. 36)ను జారీచేసింది. అప్పటివరకు ప్రభుత్వం గుర్తించిన అమరవీరుల జాబితాకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత 2015 మార్చి 27 మొదలు 2020 డిసెంబరు 2వ తేదీ వరకు మొత్తం 23 జీవోల ద్వారా మరో 126 మందికి ఆర్థిక సాయం చేసింది. దీంతో మొత్తం 585 మందికి తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 187 కుటుంబాలకు, వరంగల్ జిల్లాలో 124, నల్లగొండలో 64, మెదక్‌లో 59 కుటుంబాల చొప్పున ఆర్థిక సాయం, కొన్ని కుటుంబాలకు ఉద్యోగం అందాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 1200 మంది చనిపోయారని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. ఆ ప్రకారం ఇంకా 615 మందికి ప్రభుత్వం నుంచి సాయం అందాల్సి ఉన్నది.

అమరులు.. మనకు వేగుచుక్కలు : కేసీఆర్

‘అమరవీరుల పుణ్యమే ఇవ్వాల్టి తెలంగాణ రాష్ట్రం. మనందరం ఈ సభలో కూర్చోవడానికి వారే ఒక వేగుచుక్క. వారి త్యాగం వెలకట్టలేనిది. అన్నింటికంటే విలువైనది. జీవితాలనే బలిపెట్టారు. వారిని మించినవారెవరూ లేరు. త్యాగంలో ఇది హయ్యస్ట్. దీనికి మించిన త్యాగం ఇంకేదీ ఉండదు. ఒంటికి చిన్న నిప్పు తగిలితేనే విలవిలలాడతాం... ఒంటిమీద కిరోసిన్ పోసుకుని తగులబెట్టుకోవడం చాలా బాధాకరమైనది. చనిపోయేటప్పుడు కూడా జై తెలంగాణ అని అన్నారు.. అమ్మా.. అయ్యా అనలేదు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 జూన్ 14న అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. బలిదానం చేసినవారి గొప్పదనాన్ని గుర్తించలేని కుసంస్కారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కర్కశంగా వ్యవహరించిందన్నారు.

‘అమరులను సముచితంగా గౌరవించడానికి హైదరాబాద్‌‌లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అమరుల స్థూపానికి సెల్యూట్ చేసిన తర్వాతనే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా మంత్రులకు ఆదేశాలివ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాం. తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాన్ని నగరంలోనే గర్వపడే విధంగా ఏర్పాటు చేసుకుందాం. అమరులైనవారి ఫోటోలు, వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాటిని ఏ పద్ధతిలో పెట్టాలి, ఎలా పెట్టాలి, వాటి ఫ్రేములు ఏ సైజులో ఉండాలనేది ఆలోచన చేస్తున్నాం. అమరవీరులకు సంపూర్ణ గౌరవం చిరస్థాయిలో ఉండేలా స్మారకచిహ్నం నిర్మాణమవుతుంది.’ అని నొక్కిచెప్పారు.

ఉద్యమకారులకు ప్రత్యేక నిధి ఏర్పాటు

‘తెలంగాణ అమరవీరుల త్యాగాలను కీర్తించడమే కాదు.. వారి త్యాగాలను గుర్తించడం, ఆ కుటుంబాలను ఆదుకోవడం, ఆర్థికంగా ప్రభుత్వం అండగా నిలబడడం కూడా అవసరం. ఉద్యమకారుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం, వారి కోసం నిర్వహించే కార్యక్రమాల్లో అమరుల తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీసుకొస్తే బాగుంటుంది. స్వాతంత్ర్య సమరయోధులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ ను తెలంగాణ ప్రభుత్వం కూడా అమరవీరులకు కల్పిస్తే బాగుంటుంది. మహాత్మాగాంధీ చనిపోయిన జనవరి 30, భగత్‌సింగ్ చనిపోయిన మార్చి 23, లడఖ్‌లో పోలీసులు చనిపోయినందకు అక్టోబరు 21న అమరవీరుల దినోత్సవాలుగా జరుపుకుంటున్నందున శ్రీకాంతాచారి తొలి ప్రాణత్యాగం చేసిన రోజును తెలంగాణ అమరవీరుల స్మారకదినంగా ప్రకటిస్తే బాగుంటుంది’ అని అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్​రెడ్డి అసెంబ్లీలో 2014 జూన్ 14న వ్యాఖ్యానించారు.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నగరంలో ప్రత్యేక ఘాట్‌ను ఏర్పాటుచేసినట్లుగానే తెలంగాణ అమరవీరుల కోసం కూడా 10-15 ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా ఘాట్‌ను ఏర్పాటు చేసి అమరుల ఫోటోలు పెడితే మనం వెళ్లినప్పుడు గుర్తుకొస్తారు. అదొక అమరవీరుల నిలయంగా ఉంటుందని అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్, విమానాల్లో రాయితీలు, బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇతర రాయితీలు.. ఇలాంటివన్నీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చిన్నారెడ్డి పేర్కొన్నారు.

అమరుల కుటుంబాల్లో ఆవేదన

త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయినా చాలా అమరవీరుల కుటుంబాలు సంతృప్తిగా లేవు. ప్రభుత్వం జారీ చేసిన జీవో (నం. 80)లోని హామీలను అమలు చేయలేదన్న అసంతృప్తి వ్యక్తమైంది. తలా రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందినా మిగిలినవి అందలేదన్న ఆవేదన కనిపిస్తున్నది. ప్రభుత్వం నుంచి గుర్తింపు, గౌరవం లేదన్న బాధను కూడా అమరుల కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆహ్వానమే అందలేదని, ఇది తమను అవమానించడమేనన్న ఆవేదనను వెలిబుచ్చారు.

ఆ స్మారక చిహ్నం ఎలా ఉన్నదో చూద్దామని రెండు రోజుల ముందే వెళ్ళినా లోపలకు ఎంట్రీ దొరకలేదని గుర్తుచేశారు. కనీసం తమ పిల్లల ఫోటోలు, వివరాలు ప్రదర్శించారేమోనని చూడడానికి వెళ్లే భాగ్యం కూడా లేకపోయిందని బాధపడ్డారు. రాష్ట్ర ప్రజలందరి కోసం చావును లెక్కచేయక, బంగారు భవిష్యత్తును త్యాగం చేసినా బతికున్న తమకు మాత్రం ఆశించిన స్థాయిలో గౌరవం లభించకపోగా ఛీత్కారాలు ఎదురవుతున్నాయన్నారు. తొమ్మిదేళ్లుగా స్వయంగా అనుభవిస్తున్న ఈ బాధను దిగమింగుకోలేక, ప్రభుత్వానికి చెప్పుకునే దారి లేక సతమతమవుతూ గన్‌ పార్కు దగ్గరకు చేరుకున్నామని, అక్కడ కూడా పోలీసు ఆంక్షలే ఎదురయ్యాయని వాపోయారు.

స్మారక చిహ్నంలో వివరాలు పెట్టాలి

అమరులను గుర్తించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అమరవీరుల ఐక్య వేదిక తప్పుబట్టింది. అసెంబ్లీ వేదికగానే 1200 మంది అని చెప్పిన సీఎం ఇప్పటివరకు 585 మందికి మాత్రమే సాయం అందించారని, మిగిలినవారిని గుర్తించడానికి చొరవ తీసుకోవాలని వేదిక అధ్యక్షుడు నరేశ్ నాయక్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్మించిన మార్టిర్స్ మెమోరియల్‌ గ్యాలరీలో తెలంగాణ అమరవీరుల వివరాలు, ఫొటోలు పెట్టాలన్నారు.

అమరుల కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు వారిని కలవడానికి కూడా వీలు లేకుండా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకొడుకుగా సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదే అని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. క్రింది స్థాయి ఉద్యోగాలు పొందినవారు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారని, ప్రత్యేక మినహాయింపుగా కుటుంబాలతో కలిసి సొంత జిల్లాల్లో ఉండేలా బదిలీ చేయాలన్నారు.

Also Read: నేడు ‘అమరుల స్మారకం’ ఆవిష్కరణ

Next Story

Most Viewed