స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర వక్రీకరణ.. ఆయన ఫొటో లేకుండా ఉత్సవాలా?: మల్లు భట్టి విక్రమార్క

by Dishafeatures2 |
స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర వక్రీకరణ.. ఆయన ఫొటో లేకుండా ఉత్సవాలా?: మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర సంగ్రామ చరిత్రను వక్రీకరించే విధంగా బీజేపీ సర్కార్ అజాది కా అమృత్ పేరిట ఉత్సవాలు నిర్వహించడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దశాబ్ద కాలం పైగా జైలు జీవితం గడిపి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, నవ భారత నిర్మాణం చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో అజాది కా అమృత్ ఉత్సవాల పేరిట నిర్వహించిన ప్రదర్శనలో దేశం కోసం పోరాడిన మాజీ ప్రధాని నెహ్రూ ఫోటో పెట్టాలని అడగడానికి వెళ్లిన 12 మంది యువజన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో బంధించడం దుర్మార్గమన్నారు.

అదేవిధంగా జూన్ 12న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ పరీక్షలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్ష ఒకే రోజు ఉండటం వల్ల నిరుద్యోగులు ఏదో ఒక దానికి మాత్రమే హాజరు కావాల్సిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. దీంతో టెట్ పరీక్షలను వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళుతున్న 21 మందిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు.

అరెస్టు చేసిన విద్యార్థి, యువజన కాంగ్రెస్ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిపాలనలో భావ స్వేచ్ఛను హరించే విధంగా గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీ, ప్రధాని నెహ్రూ లేకుండా స్వాతంత్ర సంగ్రామ చరిత్ర లేదన్నారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చే వరకు జరిగిన అనేక దశల్లో జరిగిన పోరాటంలో చాచా నెహ్రూ కీలకంగా వ్యవహరించారని వివరించారు.

ఎన్టీఆర్‌కు నివాళి

దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మార్పుకు కృషి చేసిన మహా నేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు.


Next Story