Raja Singh ఇంటి వద్ద హైటెన్షన్.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలన్న పోలీసులు..

by Dishafeatures2 |
Raja Singh ఇంటి వద్ద హైటెన్షన్.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలన్న పోలీసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను వెస్ట్ జోన్ పోలీసులు గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ ఉదయమే ఆయనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేశారు. మంగళ్‌హట్ పోలీసులు జారీ చేసిన నోటీసుల్లో ఆగస్టు 24 తేదీని పేర్కొనడంపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేసినా ఆగస్టు 25 ఉదయం 11.00 గంటలకు రిసీవ్ చేసుకున్నట్లు సంతకం చేశారు. నివాసంలోనే ఉన్న రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 19న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర చీఫ్, అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీలోని 505(2), 171 రెడ్ విత్ 171-ఎఫ్, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123, 125 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని షాహినాయత్‌గంజ్ ఎస్ఐ రాజేశ్వర్‌రెడ్డి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసులో రాజాసింగ్‌కు ఆ స్టేషన్ సీఐ నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా బేగంబజార్ ఛత్రి సమీపంలో విద్వేషాలను రెచ్చగొట్టే తీరులో పాట పాడారని ఆ ఫిర్యాదులో ఎస్ఐ పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఐపీసీలోని 153-ఏ, 295-ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ రెండు పాత కేసులకు అనుగుణంగా రెండు పోలీసు స్టేషన్ల నుంచి పద్ధతి ప్రకారం సీఆర్‌పీసీలోని సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మునావర్ ఫారూకీకి వ్యతిరేకంగా వ్యంగ్య వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారంలో పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించిన పోలీసులకు నాంపల్లి కోర్టులో షాక్ తగిలింది. సీఆర్‌పీసీలోని సెక్షన్ 41 ప్రకారం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని ప్రశ్నించిన నాంపల్లి కోర్టు నిబంధనలను పాటించలేదన్న కారణంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

హైకోర్టులో పోలీసుల పిటిషన్

ఇదిలా ఉండగా నాంపల్లి కోర్టు రెండు రోజుల క్రితం రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారంపై పోలీసులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించడాన్ని కోర్టు తప్పుపట్టి బెయిల్ ఇచ్చి విడుదల చేసిన విషయాన్ని క్రిమినల్ రివిజన్ పిటిషన్‌లో ప్రస్తావించిన పోలీసులు అత్యవసర కేసుగా పరిగణించి విచారణకు స్వీకరించాలని కోరారు. అయితే చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై శుక్రవారం ఉదయం విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నది. లంచ్ మోషన్ పిటిషన్‌గా పరిగణించి విచారణకు స్వీకరించాలని కోరినా శుక్రవారం విచారించనున్నట్లు బెంచ్ పేర్కొన్నది.

Next Story

Most Viewed