- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి.. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఈవెంట్‌ల నిర్వహణ, విజయవంతం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన వ్యూహాలు, సన్నాహాలపై చర్చించేందుకు మంగళవారం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రపంచ స్థాయి కార్యక్రమం ద్వారా తెలంగాణ ఘనమైన సాంస్కృతిక వైభవం, ఆధునిక మౌలిక సదుపాయాలు, అద్భుతమైన ఆతిథ్యాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిటీ పేర్కొంది. ఇందుకోసం అవసరమైన ప్రణాళిక, ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. పోటీలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి అనువైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వేదికల ఎంపిక, అక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనపై చర్చించారు.
పాల్గొనేవారు, నిర్వాహకులు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, వసతి, కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, స్థానిక కళలు, హస్తకళలు, వంటకాలను ప్రదర్శించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. రామప్ప దేవాలయం, గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశాల సందర్శనలను కూడా కార్యక్రమంలో భాగంగా చేర్చనున్నారు. తద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనే అందరి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పోలీసు, ఇతర అత్యవసర సేవల విభాగాలతో పూర్తి సమన్వయంతో పనిచేయాలని కమిటీ సూచించింది.
వివిధ శాఖల సమన్వయంతో:
మిస్ వరల్డ్ ఈవెంట్‌ను తెలంగాణ పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక వేదికగా ఉపయోగించుకోవాలని, అంతర్జాతీయ మీడియా, డిజిటల్ ప్రచారాల ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని, పర్యాటకులను, పెట్టుబడిదారులను ఆకర్షించాలని వ్యూహరచన చేశారు.
స్థానిక భాగస్వామ్యం:
ఈవెంట్ నిర్వహణలో పర్యావరణ హిత పద్ధతులను పాటించాలని, వ్యర్థాల నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించాలని పేర్కొంది. స్థానిక ప్రజలు, కళాకారులు, యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా ఆర్థిక అవకాశాలు మెరుగుపరచాలని కూడా నిర్ణయించారు. కార్యక్రమ విజయవంతానికి పర్యాటక, సాంస్కృతిక, పట్టణాభివృద్ధి, రవాణా, పోలీసు తదితర ప్రభుత్వ శాఖల మధ్య పూర్తి సమన్వయం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. పనుల సకాలంలో పూర్తికి నిర్దిష్ట కాలపరిమితులు, బాధ్యతలను కేటాయించారు.
గొప్ప అవకాశం:
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు మాట్లాడుతూ, విశాల హృదయంతో, అసమానమైన ఆతిథ్యంతో ప్రపంచానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. మన వారసత్వాన్ని, ప్రగతిని ప్రపంచ వేదికపై చాటేందుకు ఇదొక గొప్ప అవకాశం అని అన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రకాష్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ హనుమంతు కొండిబా, ట్రాఫిక్ డీసీపీ, లా అండ్ ఆర్డర్ డీసీపీ, జీహెచ్‌ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్, అగ్నిమాపక, యువజన సేవల శాఖల డైరెక్టర్లు, వివిధ శాఖల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.