మంత్రుల పీఆర్ఓ పోస్టులకు భారీ పోటీ.. ఓ మినిస్టర్ పేషీకి ఎస్‌ఐ అప్లయ్!

by Disha Web Desk 2 |
మంత్రుల పీఆర్ఓ పోస్టులకు భారీ పోటీ.. ఓ మినిస్టర్ పేషీకి ఎస్‌ఐ అప్లయ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేబినెట్ మంత్రుల పీఏ, పీఆర్ఓ పోస్టులకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఒక్కో పేషీకి డైలీ పది నుంచి 20 అప్లికేషన్లు వస్తున్నట్లు మినిస్టర్ల పేషీ స్టాఫ్ చెబుతున్నారు. పెద్ద నేతల రెఫరల్స్ తోపాటు మంత్రులు బంధువులు, సన్నిహితుల నుంచి చాలా మంది సిఫారసు చేయించుకుంటున్నారు. మరి కొంత మంది పాత పరిచయాలతో నేరుగా మంత్రులనే సంప్రదిస్తున్నారు. గతంలో పోల్చితే పీఏ, పీఆర్ఓ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని ఓ మంత్రి ఆఫ్ ది రికార్డులో తెలిపారు. వ్యక్తుల వివరాలు, పనితీరు వంటివాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఈ సారి పీఏ పోస్టులకు ఎక్కువగా పోటీ పడటం గమనార్హం.

ఐఆండ్ పీఆర్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం, అగ్రికల్చర్ విభాగాలతోపాటు పోలీస్ శాఖలోని ఉద్యోగులు కూడా మంత్రుల పీఏ పోస్టులకు అప్లికేషన్లు ఇస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సెక్రటేరియట్ లో తనకు పీఏగా అవకాశం ఇవ్వాలని ఓ కీలక మంత్రి పేషీలో ఓ ఎస్ఐ అప్లికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. పీఏ పోస్టుకు ఇంత డిమాండ్ ఉన్నదా? అని సచివాలయంలోని సిబ్బంది షాక్ కు గురవుతున్నారు. సాధారణంగా పీఏలుగా మంత్రికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు, కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను ఎక్కువగా పెట్టుకుంటారు. కానీ ఈ సారి డిపార్ట్ మెంట్ ఉద్యోగులు కూడా పీఏలుగా పనిచేస్తామని దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యంగా కనిపించిందని ఓ మంత్రి విస్తుపోయారు.

పీఆర్ఓ పోస్టులకు సైతం..

పీఆర్ఓ పోస్టులకు సైతం భారీగానే డిమాండ్ ఏర్పడింది. వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే వ్యక్తులు, ఐఅండ్ పీఆర్ లో ఉద్యోగం చేస్తున్నోళ్లు మంత్రుల వద్ద పీఆర్ఓ జాబ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం కూడా భారీగా సిఫారసులు జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరికి కమ్మిట్మెంట్ లు పూర్తి కాగా, అధికారిక ఉత్తర్వులు అందలేదు. మరి కొంత మంది తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పనిచేసిన స్టాఫ్ కు అవకాశం ఇవ్వొద్దని సీఎం ఇప్పటికే కేబినెట్ టీమ్ కు సూచించారు. పీఏ, పీఆర్వో, ఓస్డీల ఎంపిక లో ఈ విధానాన్ని అమలు చేయాలని నొక్కి చెప్పారు. ఇది ప్రభుత్వ పాలసీగా వివరించారు.

కానీ గత పదేళ్ల పాలన లో మంత్రుల వద్ద సుదీర్ఘంగా పనిచేసిన పీఆర్వో, పీఏ, ఓఎస్డీలు మళ్లీ కొత్త ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రుల వద్ద పనిచేసేందుకు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు రహస్య మంతనాలు కూడా చేశారు. పాతోళ్ల దగ్గర పనిచేసిన పీఏ, పీఆర్వోలే మళ్లీ కొత్త మినిస్టర్ల వద్ద దరఖాస్తులు కూడా పెట్టినట్లు తెలిసింది. ఈ అంశంపై సీఎంవో సీరియస్ గా ఉన్నది. ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వివరాలన్నీ తెప్పించుకుంటునట్లు తెలుస్తున్నది. మరోవైపు రిటైర్డ్ అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దని సీఎం నొక్కి చెప్పారు. కానీ ఓఎస్డీ లుగా వచ్చేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారని సెక్రటేరియట్ వర్గాలు స్పష్టం చేశాయి.

Next Story

Most Viewed