హరీష్ రావు నైతిక ఓటమిని అంగీకరించాలి.. రఘునందన్ రావు ఫైర్

by Ramesh Goud |
హరీష్ రావు నైతిక ఓటమిని అంగీకరించాలి.. రఘునందన్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఓట్లకు డబ్బు పంచుతూ అడ్డంగా దొరుకుంతోందని, హరీష్ రావు నైతిక ఓటమిని ఒప్పుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, పఠాన్ చెరు నియోజకవర్గాల పరధిలో ఓటమిని ఒప్పుకొని నోటుకు 500, 1000 చొప్పున డబ్బు విచ్చలవిడిగా పంచుతున్నారని ఆరోపణలు చేశారు. పోలీస్ యంత్రాంగానికి చెప్పినా కూడా ఒక్కో చోటుకు వెళ్లడానికి గంట సమయం తీసుకుంటున్నారని అన్నారు. దీన్ని బట్టి మెదక్ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్ధిని అయిన తాను గెలిచినట్లు తేటతెల్లం అయ్యిందన్నారు. ఓటర్లకు డబ్బు పంచడానికి పోలీస్ యంత్రాంగం సహకరిస్తుందని చాలా స్పష్టంగా అర్ధం అవుతుందని, హరీష్ రావు నైతిక ఓటమిని అంగీకరించాలని అన్నారు.

సిద్దిపేటలో ఆయన కంటే మాకు ఎక్కువ ఓట్లు వస్తున్నట్లు తెలిసి సర్పంచులకు, ఎంపీటీసీలను పిలిచి డబ్బు పంచుతున్నారని చెప్పినా పోలీస్ వారి చర్యలు కనిపించడం లేదన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్యాలెట్ బాక్సులు సీల్ అయ్యేంత వరకు సంయమనాన్ని కోల్పోకుండా ఉండాలని, వాళ్లు ఎన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును ఆపలేరని, దీనిపై ఎన్నికల అధికారులకు పోలీస్ యంత్రాంగానికి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశామని తెలిపారు. అలాగే నిన్న రాత్రి పెద్ద శివనూరు ప్రాంతంలో 15 కార్లలో డబ్బు తీసుకెళుతున్నారని ఫిర్యాదు చేసిన 2 గంటలకు అక్కడికి వెళ్లి ఒక్క కారులో 88.40 లక్షలు పట్టుకున్నట్లు చెబుతున్నారని, ఆ కార్లలో ఒక్కో కవర్ లో బూత్ నంబర్ తో సహా డబ్బు ప్యాక్ చేసి పంపారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. బీఆర్ఎస్ నాయకులు డబ్బు పంచుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పోలీస్ యంత్రాంగం చూసి చూడనట్లు ఉంటుందని రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story