Harish Rao: వారికి తక్షణమే జీతాలు చెల్లించాలి.. బీఆర్ఎస్ నేత డిమాండ్

by Ramesh Goud |
Harish Rao: వారికి తక్షణమే జీతాలు చెల్లించాలి.. బీఆర్ఎస్ నేత డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గురుకులాల్లో ఉద్యోగులకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందలేదని, వారికి తక్షణమే జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకులాల్లో అందని వేతనాలు అని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పాలన గురుకుల విద్యార్థులకే కాదు, ఉద్యోగులు, సిబ్బందికి శాపంగా మారిందని మండిపడ్డారు. ఎస్సీ గురుకులాల్లో ఉద్యోగులకు వేతనాలు అందించక, పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నదని తెలిపారు.

గురుకులాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. రెగ్యులర్ ఉపాధ్యాయులకు సెప్టెంబర్ రెండో వారం దాటినా జీతాలు అందలేదని, పొరుగు సేవల సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు అందలేదని అన్నారు. అలాగే గెస్ట్ ఫ్యాకల్టీకి మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని, పదవీ విరమణ చేసిన 53 మంది ఉద్యోగులకు పింఛన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవని చెప్పారు. ఇక వాస్తవాలు ఇలా ఉంటే, ఒకటో తేదీనే జీతాలు చేల్లిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నదని అన్నారు. ప్రచార యావను పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి సారించాలని, ఎస్సీ గురుకుల ఉద్యోగులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed