వీఆర్ఏలపై పోలీస్ నజర్.. వ్యక్తిగత డేటాతో నిఘా

by Disha Web Desk |
వీఆర్ఏలపై పోలీస్ నజర్.. వ్యక్తిగత డేటాతో నిఘా
X

దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్ఏలపై సర్కారు ప్రతాపం చూపిస్తున్నది. సమ్మె శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదమున్నదంటూ పోలీసుశాఖ వీఆర్ఏల వివరాలను సేకరిస్తున్నది. పేరు, చిరునామా, పోస్టింగ్ ప్లేస్, మొబైల్ నంబర్, బంధువులు, స్నేహితులు (కనీసం ఇద్దరు), వాళ్ల మొబైల్ నంబర్లు అంటూ ఏడు కాలమ్స్ తో కూడిన ప్రొఫార్మాను పోలీసు శాఖ సర్క్యులేట్ చేసింది. వరంగల్ పోలీసు కమిషనర్ సర్క్యులర్ నం.547/WRLC/CSB-XI/2022, తేదీ.22.09.22 పేరిట జారీ చేసిన మెమో వీఆర్ఏల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఈ మేరకు సమాచారం కావాలంటూ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, డీసీపీలకు పంపినట్లుగా పేర్కొన్నారు. అయితే ఇది వరంగల్ నగరానికే పరిమితమా? రాష్ట్ర వ్యాప్తంగా సేకరిస్తున్నారా? అన్న విషయం ఇంకా తెలియలేదు. తమ హక్కుల సాధనకు చట్టబద్ధంగా, శాంతియుతంగా పోరాటం చేస్తున్నామే తప్ప ఎక్కడా హింసాత్మక ఘటనలకు తాము పాల్పడడం లేదని వీఆర్ఏలు చెబుతున్నారు. అలాంటి తమ వివరాలను పోలీసులు సేకరిస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నదంటున్నారు. బంధు, మిత్రుల వివరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అతి తక్కువ వేతనానికి పని చేస్తున్న తమ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన సీఎం కేసీఆర్, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైందని కాదంటున్నారు.

రెండు నెలలుగా..

వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని రెండేండ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చాలంటూ వీఆర్ఏలు 60 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. తీరొక్క ప్రదర్శనలు ఇస్తూ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలోనే ప్రతినిధి బృందంతో చర్చిస్తానంటూ మంత్రి కేటీఆర్ హామీ మేరకు తాత్కాలికంగా బ్రేకులు వేశారు. ఈ నెల 20న వీఆర్ఏ జేఏసీ బృందంతో కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ చర్చలు జరిపారు. కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తామేమైనా గొంతెమ్మ కోరికలు నెరవేర్చాలని అడుగుతున్నామా? కేవలం సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయమనే కదా.. అడుగుతున్నది అంటూ నిరసన గళాన్ని వినిపించారు. మరుసటి రోజే అన్ని జిల్లాల జేఏసీలు సమావేశమైన తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె కొనసాగించాల్సిందేనని తీర్మానించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని గుర్తించిన ప్రభుత్వం మరో రూట్‌లో అడుగులేస్తున్నట్లు తెలుస్తున్నది.



Next Story

Most Viewed