ఆదివాసీలను ప్రభుత్వాలు వేధిస్తున్నాయి.. గుర్తించకపోతే ఎవరూ కాపాడలేరు: హరగోపాల్

by Dishafeatures2 |
ఆదివాసీలను ప్రభుత్వాలు వేధిస్తున్నాయి.. గుర్తించకపోతే ఎవరూ కాపాడలేరు: హరగోపాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ, గిరిజనులను అణిచి వేస్తున్నాయని, నేడు మరింత బరితెగించి వారిని అడవుల నుంచి నిర్ధాక్షణ్యంగా గెంటి వేస్తున్నాయని పౌరహక్కుల నాయకులు, ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. శనివారం పోడు భూములకు పట్టాలివ్వాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాంపల్లిలోని ఎగ్జి‌బిషన్ గ్రౌండ్‌లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ దేశానికి బ్రిటిష్ వాడి నుంచి స్వాతంత్రాన్ని కోరిన వాళ్ళు గిరిజనులేనని, అయితే వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అణిచి చేస్తున్నాయని అన్నారు.

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం దేశంలో ఆదివాసీలు, గిరిజనులు ఎక్కడైనా నివసించవచ్చన్నారు. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని నిజంగా కాపాడుతున్నది వారేనని అన్నారు. ఇప్పటికైనా వారిని గుర్తించకపోతే అడవిని, అటవీ సంపదను ఎవరూ కాపాడలేరన్నారు. తెలంగాణ వస్తే పోడు భూములకు పట్టాలిస్తారని ఆశించిన లక్షలాది ఆదివాసుల, గిరిజనులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని, ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే పట్టాలివ్వాలన్నారు. దేశంలోని సంపదనంతా కొద్ది మంది బడా బడా కోటీశ్వరుల చేతిలో ఉండిపోయిందని, కోట్లాది పేదలు బికార్లుగా మగ్గిపోతున్నారని అన్నారు. ప్రతి 10 రోజుల కొకసారి దేశంలో బిలియనీర్ కొత్తగా పుడుతున్నారని అన్నారు. గిరిజనుల జీవన స్థితిగతులపై ఏ మీడియా చర్చించక పోవడం అన్యాయమన్నారు.

డీమానిటైజ్ చేసి పేదల బతుకులను నానా ఇబ్బందులకు గురి చేసిన మోదీ ప్రభుత్వం నేడు దేశ సంపదను బహుళజాతి సంస్థలకు అప్ప చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ఆదివాసీ, గిరిజన పిల్లలకు చదువుకోవడానికి మంచి విద్యను కల్పించాలన్నారు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం నేడు రెసిడెన్షియల్ పేరిట స్కూల్ విద్యను వారికి లేకుండా చేశారని అన్నారు. నేటికి గిరిజనులకు ప్రాథమిక వైద్య సౌకర్యాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలని అమలు కోసం పేదలంత సంఘటితంగా పోరాడాల్సిన అవసరముందని, ప్రజలు మాట్లాడాలని, ఐక్యంగా నిలబడాలన్నారు.

ఈ ఉద్యమాలే హక్కులను కాపాడుతాయన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని మహాధర్నాలో పలు తీర్మానాలు చేశారు. జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తారని రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మహా ధర్నా సీపీఐఎం-ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగింది. ఈ ధర్నాలో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, శ్రీనివాస్, రణధీర్, గౌని ఐలయ్య, భాస్కర్, బిక్షపతి, అనురాధ తదితరులు పాల్గోన్నారు.


Next Story

Most Viewed