‘హెటిరో’కు భూ కేటాయింపు పై సర్కారు యూటర్న్

by Disha Web Desk 12 |
‘హెటిరో’కు భూ కేటాయింపు పై సర్కారు యూటర్న్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెటిరో డ్రగ్స్ అధినేత బి.పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కేటాయింపుపై డాక్టర్ పింగళి ఊర్మిళ పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన హైకోర్టు పున:పరిశీలించవలసిందిగా సూచించగా, దీన్ని పరిగణనలోకి తీసుకున్న రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఇంతలోనే సరిగ్గా రెండు నెలలు కూడా తిరగకముందే యూటర్న్ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హెటిరో డ్రగ్స్ కు మళ్లీ భూ కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సరికొత్త వివాదం రాజుకుంది.

ఇప్పుడు ఇదే విపక్ష నేతలకు విమర్శనాస్త్రం గా మారింది. హెటిరో డ్రగ్స్ అధినేతకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య ఏం ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో భూ కేటాయింపును విపక్ష నేతగా ఉన్నప్పుడు తూర్పారబట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో దానికి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రూ.300 కోట్ల డీల్ అంటూ కామెంట్ చేయడంతో పాటు దాన్ని ఢిల్లీకి కప్పంగా చెల్లించినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పార్ధసారధి రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కట్టబెట్టడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఖరీదైన భూమిని ఒక్కో ఎకరానికి కేవలం రూ. 5 లక్షలకే మొత్తం 15 ఎకరాలను 30 సంవత్సరాల లీజుకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖానామెట్‌లోని సర్వే నెం. 41/14/2లోని 15 ఎకరాలను సాయి సింధు ఫౌండేషన్‌కు క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం గత ప్రభుత్వం 2018 మార్చి 23న ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం భూమికి రూ. 1,47,743 చొప్పున 30 ఏండ్లకు లీజుకు ఆమోదం తెలిపింది. మొదటి మూడు సంవత్సరాల వరకు ఇదే రేటు ఉంటుందని, ఆ తర్వాత 5శాతం పెంపుతో ప్రతి మూడేండ్లకు ఒకసారి రేట్ రివైజ్ అవుతుందని వివరించింది. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్లుగానే సాయి సింధు ఫౌండేషన్‌కు కూడా నిబంధనలు వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో రెవెన్యూశాఖ పేర్కొన్నది.

గత ప్రభుత్వ నిర్ణయంపై పీసీసీ చీఫ్ గా రేవంత్ ఫైర్..

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గతేడాది ఏప్రిల్ 10న గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో జీవోను చూపెడుతూ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి తూర్పారబట్టారు. సాయి సింధు ఫౌండేషన్ ప్రతిపాదనకు అప్పటి చీఫ్ సెక్రటరీ 10 ఎకరాలకు మాత్రమే సిఫార్సు చేశారని, ఆ తర్వాత కలెక్టర్ మాత్రం 15 ఎకరాలకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంఫారని తెలిపారు. ఒక్కో ఎకరం రేటును రూ. 33.70 కోట్లుగా కలెక్టర్ లెక్క గట్టి మొత్తంగా రూ.505 కోట్ల విలువైన భూమి అని లెక్క తేల్చారని రేవంత్‌రెడ్డి వివరించారు. అప్పటికి మార్కెట్ విలువ రూ. 15 వందల కోట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ గత సర్కారు మాత్రం దీన్ని గత ఏడాది కోర్టు తీర్పు తర్వాత పున:సమీక్షించి ఒక్కో ఎకరానికి రూ.2 లక్షల చొప్పున లీజు ధరను సవరించి ప్రతీ ఏటా 5 శాతం పెంచాలని జీవో జారీ చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి హెటిరో లేఖ

కోర్టు తీర్పును, గత ప్రభుత్వ జీవోను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29న భూ కేటాయింపు ఉత్తర్వులను పక్కకు పెట్టింది. కానీ సాయి సింధు ఫౌండేషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 12న రాసిన లేఖలో మొత్తం 15 ఎకరాలకు సంవత్సరానికి రూ. 60 లక్షలు చెల్లించనున్నట్లు వివరించింది. ఇప్పటికే క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం ఫస్ట్ ఫేజ్ పనులు రూ. 446 కోట్ల మేరకు కంప్లీట్ అయ్యాయని, ఇంకో రూ. 100 కోట్లు ఖర్చు చేస్తే మొత్తం పూర్తవుతుందని, దాదాపు 7వేల మంది సిబ్బంది రిక్రూట్‌మెంట్ కీలక దశలో ఉన్నదని, 200 మంది ఆల్రెడీ పనిచేస్తున్నారని పేర్కొన్నది. భూకేటాయింపు రద్దుతో మొత్తం ప్రాజెక్టు ప్రశ్నార్థకమవుతుందని, అందువల్ల జనవరిలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.

ఈ ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ.5 లక్షల ధరను నిర్ణయిస్తూ మొత్తం 15 ఎకరాలకు మార్చి 14న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అనుమతి ఇచ్చారు. లీజు వ్యవధి యథాతథంగా ఉంటుందని పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ ఎంపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నదనే పొలిటికల్ చర్చ మొదలైంది. ప్రతిపక్ష నేతగా తప్పుపట్టిన నిర్ణయాన్నే ముఖ్యమంత్రిగా ఆమోదించడం వివాదానికి దారితీసింది. భూకేటాయింపు జీవోను పక్కన పెడుతూ జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రశంసలు వెల్లువెత్తాయి. సాహసోపేతమైన డెసిషన్ తీసుకున్నారని అధికారుల్లోనూ చర్చలు జరిగాయి. ప్రభుత్వ భూములు ధారాదత్తం కాకుండా నిలువరించగలిగారని, విపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు కార్యరూపం ఇచ్చారన్న మాటలూ వినిపించాయి.

కానీ రెండు నెలలు తిరగకుండానే యూ-టర్న్ తీసుకున్నారనే అపవాదును ఇప్పుడు మూటగట్టుకున్నారు. అప్పటి మాటలకూ ఇప్పటి చేతలకూ పొంతనే లేదన్న విమర్శలు వచ్చాయి. ఆస్పత్రి నిర్మాణం తుది దశకు చేరుకున్నదనే సాకుతో హెటిరో డ్రగ్స్ కంపెనీకి మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారని, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పయనిస్తూ ఉన్నదనే ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ డీల్ వెనక వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ దీన్ని అస్త్రంగా వాడుకునే అవకాశమున్నది.

Next Story

Most Viewed