తెలంగాణలో మరోసారి భూములమ్మేందుకు సర్కార్ ప్లాన్.. అధికారులకు 24 గంటలు డెడ్ లైన్!

by Disha Web Desk 19 |
తెలంగాణలో మరోసారి భూములమ్మేందుకు సర్కార్ ప్లాన్.. అధికారులకు 24 గంటలు డెడ్ లైన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి పెద్ద ఎత్తున భూములు అమ్మేందుకు కసరత్తు నడుస్తున్నది. అందుకే 24 గంటల్లో లెక్కలు చేయాలని కలెక్టర్లకు, వారి నుంచి తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి. ఐతే అది కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భూముల లెక్కలు వెంటనే ఇవ్వాలంటూ హుకూం జారీ అయ్యింది. ఇదేం ఆదేశం? చాలా గమ్మత్తుగా ఉందంటూ రెవెన్యూ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎవరైనా అడిగితే మండలాలు, జిల్లాల వారీగా వివరాలు అడుగుతారు. కానీ నియోజకవర్గాల వారీగా అడగడమేమిటో అంతుచిక్కడం లేదంటున్నారు. ఒక్కో నియోజకవర్గాల పరిధి కొన్ని మండలాలు, కొన్నేమో సగం, ఇంకొన్ని గ్రామాలతో కలుపుకొని ఉంది. ఇప్పుడీ లెక్కలు ఎట్లా చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి అధికారులకు లేఖ, ప్రొఫార్మా పంపారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు వెంటనే ఇవ్వాలి. ఇప్పటికే మీ దగ్గర నియోజకవర్గాల వారీగా సమీకరించిన డేటాను పంపండి. గురువారం కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రొఫార్మాలో ప్రభుత్వ భూములు, సోషల్ వెల్ఫేర్ శాఖ సేకరించిన భూములు, సీలింగ్ ల్యాండ్స్, ఆబాది/గ్రామకంఠం, ఎండోమెంట్, వక్ఫ్​, శిఖం/ఎఫ్​టీఎల్, ఇతర ప్రభుత్వ శాఖల భూములు, గవర్నమెంట్ లీజ్డ్ ల్యాండ్స్, నోటరైజ్డ్ పట్టా ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్‌లో సాదా బైనామా కింద చేసిన భూములు వంటి కాలమ్స్‌తో వివరాలు అడగడం గమనార్హం. మున్సిపల్, కార్పొరేషన్, గ్రామ పంచాయతీల్లోనూ ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయాలను రాబడుతున్నారు.

ఎట్లా సాధ్యం?

గతంలో నియోజకవర్గాల వారీగా భూముల సమాచారం ఎప్పుడూ అడగలేదు. ఈ వింత ధోరణి ఏమిటో అర్ధం కావడం లేదని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు చర్చించుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గాల వారీగా వివరాల సేకరణ జరగలేదు. 24 గంటల్లోనే పూర్తి సమాచారాన్ని ఎట్లా సాధ్యమని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు పైసల్ పట్టీ వంటి రిజిస్టర్ మెయింటెయిన్ చేసే వారు. దాని ద్వారా ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం లభించేది. పూర్తి అబ్ స్ట్రాక్ట్ ఉండేది.

ఇప్పుడా వ్యవస్థ లేదు. ధరణి పోర్టల్ లో పహాణీ చూసే అధికారమే తహశీల్దార్లకు లేదు. అలాంటప్పుడు వీటిని ఎప్పుడు లెక్కిస్తే పక్కా సమాచారం వస్తుందన్న సందేహం వ్యక్తమవుతున్నది. కనీసం వీఆర్వో వ్యవస్థ కూడా లేకపోవడంతో డేటా సమీకరించడం కష్టమన్న అభిప్రాయం నెలకొన్నది. పైగా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయన్న సమాచారం క్రోఢీకరించడం ద్వారా ఎమ్మెల్యేలకు ఎలాంటి మేలు కలుగుతుందో వేచి చూడాలి.

Next Story