- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Good News: ప్రభుత్వ వైద్యులకు భారీ గుడ్‌న్యూస్.. అక్కడ పనిచేస్తే ఇక డబుల్ శాలరీ!
దిశ, తెలంగాణ బ్యూరో: ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే డాక్టర్లకు ప్రభుత్వం అతి త్వరలోనే శుభవార్త చెప్పనున్నది. ఆదివాసీ, గిరిజన, గ్రామీణా ప్రాంతాల్లోని డాక్టర్లకు శాలరీలను రెట్టింపు చేయాలని సర్కార్ భావిస్తున్నది. రూరల్, ట్రైబల్ కేటగిరీలుగా మార్పు చేసి ఈ ఏరియాల్లో పనిచేసే అన్ని విభాగాల వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది. ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం ఈ విధానం అమలవుతున్నది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
హెల్త్ మినిస్టర్ దామోదర ఆదేశాలతో ఆ రాష్ట్రంలో అమలు అవుతున్న ఇన్సెంటివ్ స్కీమ్‌పై వైద్యాధికారులు స్టడీ చేశారు. డీఎంఈ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌ల బృందం ఇటీవల ఒడిశా రాష్ట్రంలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన మంత్రి రాజనర్సింహ, మన స్టేట్‌లోనూ ఇలాంటి విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొత్త విధానం అమల్లోకి రానున్నది. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్టు సెక్రెటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఒడిశాలో ఇలా.. మన దగ్గరా ప్లాన్..
ఒడిశా రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక స్లాబ్ నిర్ణయించారు. బేసిక్ పేపై 25 % నుంచి 150 % వరకూ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మన దగ్గర ట్రైబల్, రూరల్ ఏరియాలను ఎంపిక చేసి స్లాబ్‌ల విధానంలోనే ఇన్సెంటివ్స్ ఇవ్వాలని సూత్రపాయ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే డబుల్ పేమెంట్(వంద శాతం ఇన్సెంటివ్), ట్రైబల్ ఏరియాల్లో125 % ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్టు తెలిసింది. మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తూ స్పెషాలిటీ సేవలు అందించే డాక్టర్లందరికీ ఈ ఇన్సెంటివ్ స్కీమ్‌ను వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డాక్టర్లకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి సుమారు రూ.200 కోట్లు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఇప్పటికే ప్రాథమికంగా సిద్ధమైన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఎందుకు ఈ నిర్ణయం..?
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల కంటే, హైదరాబాద్‌లో పనిచేసే డాక్టర్లకు హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా వస్తోంది. దీని వల్ల మెజార్టీ డాక్టర్లు హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకే పరిమితమవుతున్నారు. అంతేగాక ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తూనే, హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్పిటళ్లలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంత మంది డాక్టర్లు సొంతంగా కూడా హాస్పిటళ్లూ రన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే వేతనాల కంటే రెట్టింపు స్థాయిలో సంపాదిస్తున్నారు. మరి కొందరు పిల్లల ఉద్యోగాలు, చదువుల నిమిత్తం నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేసేందుకు డాక్టర్లు ఇష్టపడటం లేదు.
ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్, ములుగు, భూపాల్‌పల్లి, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేసేందుకు డాక్టర్లు దొరకడం లేదు. దీన్ని గమనించిన హెల్త్ మినిస్టర్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , అవసరం మేరకు స్టాఫ్‌ను నియమించేందుకు వేగంగా కసరత్తు చేయాలని మంత్రి అధికారులకూ ఆదేశాలిచ్చారు. లేకుంటే మెడికల్ కాలేజీలను నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసే ప్రమాదం కూడా ఉన్నదని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఈ స్కీమ్ అమలుతో జిల్లాల్లోనే స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుతాయని, తద్వారా హైదరాబాద్‌లోని గాంధీ ఉస్మానియా వంటి దవాఖాన్లపై పేషెంట్ లోడ్ తగ్గుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. పేషెంట్లకు కూడా ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు.