''పండుగ పూటైనా ఒకటో తేదీన జీతాలివ్వండి''

by Disha Web Desk 19 |
పండుగ పూటైనా ఒకటో తేదీన జీతాలివ్వండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం పండుగ పూట అయినా ఒకటో తేదీన జీతాలివ్వాలని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొద్ది నెలలుగా సమయానికి జీతాలు ఇవ్వడంలేదని, ఈ దుస్థితికి కారణమెవరని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ధనిక రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించిందో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే నెల 5వ తేదీన పండుగ ఉండటంతో అప్పటికైనా వేతనాలు వస్తాయా? పింఛన్లు అందుతాయా అనే భయం ఉద్యోగుల్లో నెలకొందని ఆయన వెల్లడించారు. గతేడాది కూడా దసరా పండక్కి జీతాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. సమయానికి జీతం రాక ఉద్యగులు అప్పులు చేయడంతో వాటికి కట్టే వడ్డీలు కట్టలేక ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. దసరా నేపథ్యంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ కుమార్, కటకం రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణకు అతి పెద్ద పండుగ అయిన దసరాకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేకపోతే తెలంగాణ తెచ్చుకుని ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. సంతోషంగా వేడుక జరుపుకోవాలంటే ప్రభుత్వమిచ్చే వేతనాలపైనే ఆధారపడి ఉందని, ప్రభుత్వం ఈసారి కూడా నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అంతేకాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన మూడు డీఏ బకాయిలను సైతం దసరా సందర్భంగా అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story