వీధి వ్యాపారుల భద్రత, జీవనోపాధిపై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ

by Mahesh |
వీధి వ్యాపారుల భద్రత, జీవనోపాధిపై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ హాకర్స్ ఫెడరేషన్ (ఎన్‌హెచ్‌ఎఫ్) ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీధి వ్యాపారుల హక్కులు, వృత్తి స్వాతంత్య్రం, జీవనోపాధి భద్రత, చట్టపరమైన గుర్తింపు, వాణిజ్య నిర్వహణకు సంబంధించిన విధానాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈసందర్భంగా ఎన్‌హెచ్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శక్తిమాన్ ఘోష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 1,500కి పైగా అనుబంధ సంఘాలు, 20 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

వీధి వ్యాపారుల గుర్తింపు..

జీహెచ్ఎంసీ పరిధిలోని వ్యాపారులకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడం ద్వారా వారికి చట్టపరమైన భద్రత కల్పించాలనే అంశాన్ని ఎన్‌హెచ్‌ఎఫ్ ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రభుత్వం జారీ చేసే వెండింగ్ సర్టిఫికెట్ల ద్వారా వారికి అధికారిక గుర్తింపు లభిస్తుందని వివరించారు.

వెండింగ్ జోన్ల ఏర్పాటు..

వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సుముఖమైన వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ జోన్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించాలన్నారు.

టౌన్ వెండింగ్ కమిటీల (టీవీసీ) ఏర్పాటు..

వీధి వ్యాపారులతో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎన్జీఓలు కలిపి ఏర్పాటు చేసే టౌన్ వెండింగ్ కమిటీల ద్వారా పారదర్శకతతో విధానాలు రూపొందించవచ్చని ఎన్‌హెచ్‌ఎఫ్ పేర్కొంది. జీహెచ్ఎంసీ కూడా ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిగణించాలని కోరారు.

వీధి వ్యాపార విధానం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అనుసరిస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక వీధి వ్యాపార విధానాన్ని రూపొందించాలని, దానిలో వ్యాపారుల హక్కులు, భద్రత, జోన్‌ల కేటాయింపు, జరిమానాల పరిమితులు తదితర అంశాలు స్పష్టంగా ఉండాలని సూచించారు.

హక్కుల పరిరక్షణ, జీవనోపాధి భద్రత..

అక్రమ తొలగింపులు, వేధింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులకు సరైన న్యాయం జరగాలని, వారి జీవనోపాధికి భద్రత కల్పించేందుకు పాలకులు చిత్తశుద్ధి తో ముందుకు రావాలన్నారు. మేయర్, ప్రతినిధుల అభిప్రాయాల ప్రకారంగా వీధి వ్యాపారుల సంక్షేమం కోసం అధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు. వీధి వ్యాపారులు నగర అభివృద్ధిలో భాగస్వాములని, వారు ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానాలు కనుగొనే దిశగా నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed