నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్.. విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

by Rajesh |
నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్.. విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, శేరిలింగంపల్లి : నకిలీ సర్టిఫికెట్లు, స్టాంప్స్ తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటుగాళ్లు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి జీహెచ్ఎంసీ, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖలను బురిడీ కొట్టించారు. బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఈ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు.

కూకట్‌పల్లి, బాలానగర్, కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ల పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి లోన్లు తీసుకుంటున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై ఎస్‌ఓటీ బాలానగర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పోలీసులు గత రెండు నెలలుగా లోతుగా దర్యాప్తు చేపట్టారు. సుధాకర్, రంగారావు, చంద్రశేఖర్ రావు, సీతారాం అనే కీలకంగా వ్యవహరిస్తూ ఈ ముఠాను నడుపుతున్నారు. వీరు జీహెచ్ఎంసీలో బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన పత్రాలు, రెవెన్యూలో ల్యాండ్ డాక్యుమెంట్లు, హెచ్ఎండీఏ పత్రాలు, బ్యాంక్ లోన్లకు అవసరమైన నకిలీ కాగితాలు ఇలా అనేక రకాల నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ అవసరమైన వారికి వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

వీరి వద్ద ఏ కార్యాలయానికి సంబంధించినవి కావాలంటే ఆ కార్యాలయం స్టాంప్‌లు, పత్రాలు, అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. రంగారావు అనే వ్యక్తిపై గతంలోనూ ఈ తరహా కేసులు ఉన్నాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరో నిందితుడు చంద్రశేఖర్, సీతారాం అనే మరో నిందితుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు, అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి, నాగమల్లేశ్వర్ రావు అనే మరో వ్యక్తి ద్వారా ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నకిలీ పత్రాలు, స్టాంప్స్ వ్యవహారంలో అడ్వకెట్స్, బ్యాంకు మేనేజర్ల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.

బ్యాంక్‌ల నుండి బిజినెస్ లోన్ల కోసం తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారని, ఎస్ ఓటీ బాలానగర్, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులు గత రెండు నెలలుగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారని అన్నారు. నకిలీ పత్రాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు ఇదే పెద్ద గ్యాంగ్ అని 8 ఏళ్ల నుండి ఇప్పటి వరకు వీరు అరెస్ట్ కాలేదని, ఈ ముఠాలో మొత్తం 18 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరి వద్ద నుండి 687 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 1180 ఫేక్ సర్టిఫికెట్లు, 10 ల్యాప్ టాప్ లు, 8 సీపీయూలు, 8 మానిటర్లు, 2 ప్రింటర్లు, 1 స్టాంప్ మేకింగ్ మెషిన్, 1 స్టాంప్ ఫ్లాషర్, 57 మొబైల్ ఫోన్స్, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని సీపీ తెలిపారు.Next Story

Most Viewed