అలాంటి మొనగాడే లేడు.. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 19 |
అలాంటి మొనగాడే లేడు.. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రేణుకా చౌదరి ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల ఎవరో తనకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలది ఆంధ్రా అని.. వాళ్ల అన్న జగన్ కూడా అక్కడే ఉన్నారన్నారు.

ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వాళ్లంతా ఖమ్మం జిల్లాలో ఎందుకున్నారని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఎవరూ ఎన్ని చేసిన ఖమ్మం నుండి నన్ను పంపే మొనగాడు లేడని.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అడ్రస్ లేకుండా పోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని.. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పునీతులవుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ సభతో బీఆర్ఎస్, బీజేపీలకు భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.

కాగా, రేణుకా చౌదరి వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని ప్రారంభించిన షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించింది.

శనివారం వైఎస్ జయంతి సందర్భంగా పాలేరులో ఆయన విగ్రహాం ఆవిష్కరించి.. తాను పాలేరు నుండే బరిలోకి దిగుతానని మరోసారి షర్మిల స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్‌కు అభిమానులు ఎక్కువగా ఉండటంతో షర్మిల పోటీకి ఆ జిల్లాను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాక్టివిటీస్ పెంచారు. ఇలా, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల్లో షర్మిల జోక్యం చేసుకోవడంతోనే ఆమెను రేణుకా చౌదరి టార్గెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed