బీఆర్ఎస్‌కు షాకిచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌కు షాకిచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌కు బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ షాకిచ్చారు. గురువారం చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ నుంచి భారీగా బీజేపీలోకి చేరికలు జరిగాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, సీనియర్ లీడర్లు భారీగా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రధాని మోడీకి ప్రజల మద్దతు లభిస్తోందని అన్నారు. తాను చేవెళ్ల ప్రజలకోసమే పనిచేస్తున్నానని.. ఇక్కడే ఉంటానని చెప్పారు. ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 లకు పైచిలుకు స్థానాల్లో బీజేపీ ఈ సారి జెండా పాతబోతోందని తెలిపారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో గెలుపొందిన బీజేపీ.. అదే జోరును లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి చివరివారంలోపు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే చేవెళ్ల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ అధిష్టానానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంకేతాలు పంపారు.

Next Story