కేసీఆర్‌కు అధికారం ఇచ్చింది అక్రమాలు చేయడానికి కాదు: మాజీ ఎంపీ

by Disha Web Desk 2 |
కేసీఆర్‌కు అధికారం ఇచ్చింది అక్రమాలు చేయడానికి కాదు: మాజీ ఎంపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మద్యం, పెట్రోల్, భూకబ్జాలతో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ప్రతినే రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా చదవాల్సి ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. తెలంగాణ రాకముందు 20 లక్షల ఎకరాలకు నీరు అందిస్తే.. వచ్చాక 73 లక్షలకు అందించినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజ కేంద్రమే కొనుగోలు చేస్తోందని, కేసీఆర్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెట్టేనని ఆయన వాపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎంత ఖర్చు చేసింది అనే అంశంపై స్పష్టతనివ్వాలని కొండా డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేసి ధనవంతులవుతున్నారని ఆరోరపణలు చేశారు. దేవాలయం, వక్ఫ్ భూములను కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్‌కు అధికారం ఇచ్చింది కబ్జాలు, అవినీతి అక్రమాలు చేసేందుకు కాదని, ప్రజలకు సేవ చేయడానికని చురకలంటించారు. కేసీఆర్ వ్యవహారం వల్ల తెలంగాణ పాకిస్తాన్, శ్రీలంకలా తయారయ్యే ప్రమాదం ఏర్పడిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed