వచ్చే ఎన్నికల్లో.. జమిలీ లేదు.. మహిళా రిజర్వేషన్ ఉండదు: మాజీ MP వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
వచ్చే ఎన్నికల్లో.. జమిలీ లేదు.. మహిళా రిజర్వేషన్ ఉండదు: మాజీ MP వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును తాము స్వాగతిస్తున్నామని, కానీ మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తాము భావించడంలేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికలకు జమిలి విధానం ఉండే అవకాశమే లేదని.. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ కూడా వర్తిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు.

మహిళా బిల్లుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మహిళా రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే బిల్లులో జన గణనను, డీలిమిటేషన్ ప్రక్రియను లింక్ చేసి ఉండేది కాదన్నారు. ఈ రెండింటిని పెట్టడంతోనే ఇప్పటికప్పుడు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం లేదని స్పష్టమవుతున్నదన్నారు.

మహిళా సాధికారతపై బీజేపీకి నిజాయితీ ఉంటే వెంటనే రాబోయే ఎన్నికల్లోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ఈ బిల్లులోని అంశాలను పరిశీలిస్తే 2028 లేదా 2029లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకే కాక ఆ తర్వాత జరిగేవాటికి కూడా మహిళా రిజర్వేషన్ వర్తించడం అనుమానమేనని అన్నారు.

మరో పదేళ్ళ వరకూ మహిళా రిజర్వేషన్ ఉండకపోవచ్చనే సందేహం కలుగుతున్నదని పేర్కొన్నారు. ఇరవై ఏండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 82వ అధికరణానికి చేసిన సవరణ కారణంగా 2026 సంవత్సరం వరకు డీలిమిటేషన్ చేసే అవకాశమే లేదని, ఆ తర్వాత జరిగే జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ సాధ్యమన్నారు.

ఈ దశాబ్దికి 2021 నుంచే జనాభా లెక్కల ప్రక్రియ మొదలుకావాల్సి ఉన్నదని, కానీ కరోనా కారణంగా ఇప్పటికే చేపట్టలేదని, ఒకవేళ వెంటనే చేపట్టినా మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి అవసరమైన డీలిమిటేషన్ చేయాలంటే 2026 తర్వాతనే సాధ్యమన్నారు. జనాభా లెక్కలకు ఎలాగూ రెండేండ్లకంటే ఎక్కువ సమయం పడుతుందని, ఆ తర్వాత డీలిమిటేషన్‌కు కూడా అంతే సమయం పడుతుందని, 2026 తర్వాత దాదాపు ఐదేళ్ళు పట్టొచ్చన్నారు. అప్పటికి 2029 లోక్‌సభ ఎన్నికలు కూడా పూర్తవుతాయని, ఆ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ లభించే అవకాశాలే లేవన్నారు. నిజంగా 2029 ఎన్నికల్లోనైనా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఆర్టికల్ 82కు కూడా సవరణలు చేయడం తప్పనిసరి అవుతుందన్నారు.


Next Story

Most Viewed