హైదరాబాద్‌కు వివేకా హత్య కేసు ఫైళ్లు.. కుమార్తె రిక్వెస్టుతో సుప్రీం నిర్ణయం

by Dishanational4 |
హైదరాబాద్‌కు వివేకా హత్య కేసు ఫైళ్లు.. కుమార్తె రిక్వెస్టుతో సుప్రీం నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ప్రక్రియ హైదరాబాద్‌కు బదిలీ అయింది. ఇంతకాలం కడప జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరగ్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియ నగరంలోని సీబీఐ కోర్టుకు షిఫ్ట్ అయింది. దీంతో కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి మూడు ఇనుప పెట్టెల్లో భారీ భద్రత నడుమ డాక్యుమెంట్లు, ఆధారాలు, ఫైళ్ళు తదితరాలన్నీ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు మంగళవారం చేరుకున్నాయి. ఈ ఫైళ్ళలో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం, కేసుకు సంబంధించిన ఎవిడెన్సులు, పోలీసులు సేకరించిన వివరాలు, కస్టడీలోకి తీసుకుని రాబట్టిన సమాచారం తదితరాలన్నీ ఉన్నాయి. ఇప్పటికే చార్జిషీట్‌ను కూడా సమర్పించినందున సీబీఐ కోర్టు దానిని పరిశీలించి నంబరింగ్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్‌లోనే విచారణ జరగనున్నది.

వైఎస్ వివేకానంద హత్య కేసును రాష్ట్ర దర్యాప్తు నుంచి సీబీఐకి బదిలీ కావడంతో తదుపరి విచారణ కూడా సీబీఐ కోర్టులోనే జరగాల్సి వచ్చింది. ఈ హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్, సునీల్ యాదవ్ తదితరులపై సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్ నమోదు చేసింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపైనా సప్లిమెంటరీ చార్జిషీట్‌ను సీబీఐ కడప జిల్లాలోని సెషన్స్ కోర్టుకు సమర్పించింది. సీబీఐ దర్యాప్తునకు లైన్ క్లియర్ అయింది కడప జిల్లా పరిధిలో జరుగుతున్నందున వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ, కోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల జరగాలన్న విజ్ఞప్తిని కోర్టుకు తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి కేసు తదుపరి విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేసింది.

సీబీఐ సమర్పించిన చార్జిషీట్‌లను ఇప్పటివరకూ కడప జిల్లా సెషన్స్ కోర్టు పరిశీలించింది. ఇప్పుడు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ కావడంతో ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధ్యయనం చేయడంతో పాటు చార్జిషీట్‌లోని వివరాలు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తదితరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ తేదీలపై నిర్ణయం తీసుకోనున్నది. చార్జిషీట్‌లకు నంబరింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేసు ట్రయల్‌పై సీబీఐ కోర్టు ఒక అంచనాకు వస్తుంది. ఇకపైన విచారణ మొత్తం హైదరాబాద్‌లో జరగనున్నందున నిందితులు, సాక్షులు తదితరులు అవసరానికి అనుగుణంగా హైదరాబాద్ కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది.


Next Story