కవిత బతుకమ్మ అంటూ బతక నేర్చింది.. Congress మాజీ ఎంపీ Madhu Yaskhi Goud ఆగ్రహం

by Disha Web Desk 4 |
కవిత బతుకమ్మ అంటూ బతక నేర్చింది.. Congress మాజీ ఎంపీ Madhu Yaskhi Goud ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ రియాక్ట్ అయ్యారు. కవిత.. బతుకమ్మ అంటూ బతక నేర్చిందని ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ముసుగులో ప్రజల ఆకాంక్షలు అడ్డుపెట్టుకుని కేటీఆర్, కవిత రాజకీయాల్లోకి వచ్చారని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ పరవేశ్ వర్మ గతంలో కవితతో కలిసి పని చేశారని, కవిత అవినీతి చేయకుంటే ఆదాయ మార్గాలు లేకుండానే ఆమెకు బిల్డింగులు, వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు తప్పు అని కవిత చెప్పడం లేదని, ఆమెను వెంటనే కేసీఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

తన కూతురు, కుమారుడిపై ఆరోపణలు వస్తే సహించనని గతంలో కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు కవితపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటో పరవేశ్ వర్మ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో కవిత దిట్ట అని, అందువల్ల కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే ఎంక్వైరీ చేయాలన్నారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరించాలన్నారు. మహిళగా ఉండి లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లడం సిగ్గుగా లేదా? అని విమర్శించారు. తెలంగాణ జాగృతి పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కవితకు ఇంకా ఎన్ని కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. తనపై ఆరోపణలు రాగానే తెలంగాణ సెంటిమెంట్ అంశాన్ని లేవనెత్తుతూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తోందని, లిక్కర్ స్కామ్ తో పాటు కాళేశ్వరం అవినీతిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే కేసీఆర్ కుటుంబీకులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

లిక్కర్ స్కాం లో కేసీఆర్ పాత్ర ఏంటో సీబీఐ తేల్చాలన్నారు. టీఆర్ఎస్ నేతలతో పాటు ఆప్ నేతలపై కూడా దర్యాప్తు చేపట్టాలన్నారు. లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజానీకం క్షమించదన్నారు. సోనియాగాంధీ చొరవ వల్ల కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ఏర్పడిందని, అయితే రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ద్రోహులను చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తానని చెప్పిన కేసీఆర్.. యువతని మత్తుకు బానిసలు చేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన 8 ఏళ్లలో రూ.1,35,000 కోట్లు ఆదాయాన్ని లిక్కర్ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ పెంచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక లిక్కర్ సేల్స్ తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తి ఎంత?.. ఇప్పుడు ఎంత ఉందో తేల్చాలన్నారు.

రాష్ట్ర అధికారులు టీఆర్ఎస్ తొత్తులుగా మారారని, అందువల్ల దర్యాప్తు పారదర్శకంగా జరగదని అన్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కవితపై దర్యాప్తుకు కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని నిలదీశారు. విచారణకు జరుగుతన్న ఆలస్యాన్ని చూస్తుంటే బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్యయ్యాయనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కవితపై దర్యాప్తుకు డిమాండ్ చేయాలన్నారు. టానిక్ ల పేరుతో సంతోష్ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. 2014లో కవిత ఆదాయం ఎంత ఇప్పుడు ఎంత అనేది విచారణలో బయటపడుతుందని సీబీఐ, ఈడీ వెంటనే దాడులు చేస్తే కవిత అక్రమ ఆస్తులు, లిక్కర్ స్కాంలో అన్ని వివరాలు వెలుగు చూస్తాయన్నారు.

ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు ఉద్రిక్తత

Next Story

Most Viewed