పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 14 |
పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై హైదరాబాద్‌‌కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయాకర్ రావు తనను అక్రమంగా నిర్బంధించి తన సమీప బంధువు విజయ్ పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు తనను నిర్బంధించ డమే కాకుండా రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ తన కుటుంబ సభ్యులను బెదిరించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

విజయ్‌కు నాకు సంబంధం లేదు

తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తే సరికాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. తన గురించి వాస్తవాలు తెలుసుకుని పత్రికల్లో రాయలని సూచించారు. ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లానని తెలిపారు. విజయ్ అనే వ్యక్తి తనకు బంధువు కాదని స్పష్టం చేశారు. విజయ్‌ అనే వ్యక్తిది విజయవాడ అని, ఆయన ఎవరో కూడా తనకు సరిగ్గా తెలియదని చెప్పారు. విజయ్ తన కులం సంబంధించిన వ్యక్తి కూడా కాదని తెలిపారు. ఇవన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఆరోపణలు రావడంతో అమెరికా నుంచి విజయ్‌ అనే వ్యక్తి తనకు తాజాగా ఒక వీడియో పంపారని వెల్లడించారు.

శరణ్ చౌదరి అనే వ్యక్తి దొంగ పత్రాలు సృష్టించి తనను మోసం చేసి.. తన వద్ద ఉన్న రూ. 5 కోట్లు తీసుకున్నారని విజయ్ అనే వ్యక్తి వీడియో లో మాట్లాడారు. తన భూమి కబ్జా జరిగిందని ఎర్రబెల్లిని కలిసి న్యాయం చేయాలని గతంలో కోరాని గుర్తుచేశారు. పోలీసులను కలిసి ఫిర్యాదు చేయాలని ఎర్రబెల్లి సూచించారని విజయ్ ఈ సందర్భంగా వీడియోలో మాట్లాడారు. తనకు ఎర్రబెల్లికి ఎటువంటి సంబంధం లేదని, బంధుత్వం, వ్యాపార లావాదేవీలు కూడా లేవన్నారు. ఎన్ఆర్ఐ అయిన తనకు ఎర్రబెల్లిని కేవలం హెల్ప్ మాత్రమే చేశారన్నారు.

పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి

ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని ఎర్రబెల్లి అన్నారు. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఎవరో తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణలో తేలుతుందని స్పష్టంచేశారు. నేనెవరో తనకు తెలియదని ప్రణీత్ రావే చెప్పారని తెలిపారు. మరోవైపు తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. స్నేహితుల ద్వారా కొన్ని పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. దీంతో మాట వినలేదని తన పై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. కావాలనే వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్ చేశారని చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed