ఒక్క నియోజకవర్గంపై ఐదుగురు అగ్రనేతల కన్ను.. వారిదే ఆధిపత్యం!

by Disha Web Desk 2 |
ఒక్క నియోజకవర్గంపై ఐదుగురు అగ్రనేతల కన్ను.. వారిదే ఆధిపత్యం!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: పాలేరు.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం. ఇంకా ఎన్నికల సీజన్ మొదలే కాలేదు కానీ.. ఇక్కడ మాత్రం అన్ని పార్టీలు ఇప్పటి నుంచి తమ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి.. ప్రత్యర్థుల బలాబలాలు అంచనా వేస్తున్నారు.. ఎత్తుకు పైఎత్తులు మొదలయ్యాయి.. మాటల తూటాలు పేలుతున్నాయి.. ఎందుకింత హాట్ హాట్ అనుకుంటున్నారా..? ఇక్కడనుంచి ఇప్పుడు రాష్ట్రస్థాయి నేతలు పోటీకి సై అంటున్నారు.. అధికార పార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే నియోజకర్గంలో పాగా వేసేందుకు ఎవరికి వారు వ్యూహాలను రచిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సైతం ఇక్కడినుంచే పోటీ చేసేఅవకాశాలు ఉన్నాయి.. లేదా అధికార పార్టీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కేటాయించమని అడిగే సూచనలే కనిపిస్తున్నాయి.. వీరికి తోడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం ఇక్కడి నుంచే పోటీకి సై అంటున్నట్లు తెలుస్తోంది..

గత చరిత్ర చూస్తే..

1962 నుంచి పాలేరు నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అప్పటినుంచి 2004 వరకు ఎస్సీకి రిజర్డ్వ్ చేయబడ్డ నియోజకవర్గం 2009 నుంచి జనరల్ స్థానంగా ఉంటోంది.. దీంతో ఆ నియోజకవర్గంపై జనరల్ అభ్యర్థుల దృష్టి పడింది. 2009లో కాంగ్రెస్ తరఫున రాంరెడ్డి.. సీపీఎం తరఫున పోటీచేసిన తమ్మినేని వీరభద్రంపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా వెంకటరెడ్డి.., టీడీపీ తరఫున పోటీచేసిన బేబీ స్వర్ణకుమారిపై గెలుపొందారు. అనంతరం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో 2016లో వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాంరెడ్డి సుచరిత మీద గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మీద గెలుపొందారు. అనంతరం కందాల ఉపేందర్ రెడ్డి అధికార పార్టీలో చేరడంతో అక్కడ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.

ఆర్థిక మూలాలున్న నియోజకవర్గం

ఉమ్మడి ఖమ్మంలో కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలే జనరల్ స్థానాలు.. ఈ నేపథ్యంలో అగ్ర సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ ఈ మూడు నియోజకవర్గాలపై కన్నేస్తూ వస్తున్నారు. వీటిలో కొత్తగూడెం నియోజకవర్గం జిల్లా కేంద్రం అయినప్పటికీ ఏజెన్సీ ఏరియా కావడం.. ఆర్థిక వనరులు కూడా తక్కువగా ఉండడంతో అక్కడ స్థానిక నేతలు తప్ప మిగతా వారు ఎవరూ ఆసక్తి చూపరు.. అంతేకాకుండా ఇక్కడ ఓటు బ్యాంకును అంచనా వేయడం కొంచెం కష్టమనే భావన ఉంది.. ఇక ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బలంగా ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా ఆలోచిస్తారు. ఇక మిగిలింది పాలేరే. ఈ నియోజకవర్గం ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకుని విస్తరించి ఉండడం ఒకటైతే.. ఈ నియోజకవర్గంలోనే రియల్ ఎస్టేట్, గ్రానైట్ వ్యాపారాలతో పాటు ఆర్థిక వనరులున్న నియోజకవర్గంగా చెబుతుంటారు.

వారిదే ఆధిపత్యం..

ఇక పాలేరు నియోజకవర్గం మొదటినుంచి కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు కంచుకోట. గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నప్పటికీ పోనుపోను కాంగ్రెస్ చాలా బలపడింది.. ఇక్కడ సీపీఎం 1985, 1994 రెండు సార్లు గెలుపొందగా.. కాంగ్రెస్ 1989, 1999, 2004, 2009, 2014, 2018 ఆరుసార్లు గెలుపొందింది. బీఆర్ఎస్ మాత్రం 2016లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీలో పోటీ చేసినా కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టేది. ఈ నియోజకవర్గంలో గెలుపొందాలంటే కమ్యూనిస్టుల సహకారమూ ఉండాలనే ప్రచారం ఉంది.

రాష్ట్ర నేతల కన్ను..

పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సై అంటున్నారు. వీరిద్దరి మధ్య వర్గపోరుతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిందనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ ఎవరికి కేటాయిస్తుందో.. మిగతా వారు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.. ఇక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సైతం ఇక్కడ నుంచి ఈ సారి పోటీ చేసేందుకు రెడీగానే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్‌తో పొత్తు కుదిరితే పరిస్థితి ఏంటో.. ఎవరికి సహకరిస్తారో తేలాల్సి ఉంది.. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సైతం పాలేరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. తన తండ్రి వైఎస్ఆర్ అభిమానులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తనుకు సహకరిస్తారంటోంది షర్మిల.. తాజాగా పొంగులేటి సైతం పాలేరునే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈయనకు పాలేరులో బలమైన అనుచరులు ఉన్నట్లు చెబుతున్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల గెలిచేందుకు పొంగులేటి సహకారం అందించారనే ప్రచారమూ లేకపోలేదు.. మొత్తానికి ఇంత మంది రాష్ట్రనేతలు పాలేరుపై కన్నేయడంతో ఇప్పుడు ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది..

నువ్వా నేనా అంటున్న తుమ్మల, కందాల

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, వారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నియోజకవర్గంలో కనపడుతోంది. పార్టీలో సీనియర్ నేతగా తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులను ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన అనుచరులు ఎప్పటినుంచే టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. అయితే ఆధిపత్యం కోసం ముందునుంచి ప్రయత్నిస్తున్న కందాలకు పార్టీ పెద్దల నుంచి కూడా సపోర్ట్ ఉన్నట్లు తుమ్మల వర్గీయులే అంటున్నారు. 2018 ఎన్నికల్లో కూడా కావాలనే తుమ్మలను ఓడించి ఆ తర్వాత కందాలను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అయితే అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు కొంత సైలెంట్‌గానే ఉంటున్నారు. అయితే ఇటీవల పొంగులేటి పరిణామాలతో మళ్లీ తుమ్మలకు కలిసొచ్చినట్లయింది.. ఈక్రమంలో అధిష్టానం ఆయనకు మళ్లీ ప్రయార్టీ ఇస్తుండడంతో టికెట్ ఆయనకే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ రాకపోయినా.. అది అక్కడి గెలుపోటముల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

Read more:

తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు షురూ....ముగ్గురు సీనియర్ అధికారుల బృందం సమీక్ష

Next Story

Most Viewed