రేవంత్ ప్రభుత్వంపై రైతులు విశ్వాసం కోల్పోయారు: ఎమ్మెల్యే పల్లా

by Disha Web Desk 12 |
రేవంత్ ప్రభుత్వంపై రైతులు విశ్వాసం కోల్పోయారు: ఎమ్మెల్యే పల్లా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు బంధు, రుణ మాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అందుకే రైతులకు రేవంత్ ప్రభుత్వం పై విశ్వాసం పోయిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకే కొనుగోలు కేంద్రాలకు కాకుండా దళారుల దగ్గరికి రైతులు ధాన్యం తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వకపోగా, కనీస మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు క్వింటాకు 1500 చొప్పున అమ్ముకుంటున్నారన్నారు.

జనగామలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 440 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ కు 4 వేల మెట్రిక్ టన్నులు వస్తే.. అక్కడ కేవలం 1530 మాత్రమే ఇస్తున్నారని, మద్దతు ధరకు 700 రూపాయలకు తక్కువగా వ్యాపారులు, దళారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ విషయం సీఎం వరకు వెళ్లినా రైతులకు అదనంగా లభించింది 30 రూపాయలు మాత్రమేనన్నారు. రేవంత్ అధికారులను ప్రశ్నించడమా? అని ప్రశ్నించారు. దళారుల చేతుల్లోకి మార్కెట్లు వెళ్లిపోయాయని, సీఎం, మంత్రులు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

500 బోనస్ ఇచ్చి క్వింటాకు 2500లకు ధాన్యం కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చెప్పి మోసం చేశారన్నారు. బోనస్ మాట దేవుడెరుగు ..మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో రేవంత్,భట్టి విక్రమార్క ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వడ్లను తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు నష్ట పోయిన మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేయాలని కోరారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. రైతులు ధాన్యం కేంద్రాలకే వెళ్లి మద్దతు ధర, బోనస్ కోసం ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలు వ్యవసాయ శాఖల మంత్రి చోద్యం చూస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతులు మరింత నష్టపోక ముందే ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా, బోనస్ ఇచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు పెరిగాయన్నారు. ఒక వైపు పంటలు ఎండిపోవడం, మరోవైపు మద్దతు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారన్నారు. రాష్ట్రమంతా రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ పేరు తో సీఎం, మంత్రులు రైతుల నుంచి తప్పించుకోవాలనుకుంటే కుదరదని, వెంటనే రైతులకు మద్దతు ధర దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story