కేటీఆర్ స్పీచ్‌ తో చెవుడొస్తది.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web |
కేటీఆర్ స్పీచ్‌ తో చెవుడొస్తది.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ శాసనసభలో ఇచ్చిన స్పీచ్ తో అందరికీ చెవుడు వచ్చేలా ఉందని, ఈ సమావేశాలు పూర్తయ్యాక కంటి వెలుగు పథకంలా చెవి వెలుగు కూడా పెట్టాలేమో అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవాచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తే అది ఓర్వలేక ఖమ్మంలో ఆ రైలుపై రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ఆయన ఇచ్చేదానికంటే ఎక్కువ పెన్షన్ పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయన్నారు. ప్రతి బుడ్జెట్ లో లక్ష కోట్లు అదనంగా చేసి చూపిస్తున్నారని కొండా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రగతి కేవలం కేసీఆర్ వల్లే జరగలేదని, ఆయన స్థానంలో ఎవరున్నా అభివృద్ధి జరిగేదన్నారు. 100 టీఎంసీల నీరు నిల్వ చేసే దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను రూ.1600 కోట్లతో నిర్మించారని, దీని ద్వారా 6 లక్షల ఎకరాలు పారుతోందన్నారు.

దేశంలోనే అంత్యత అవినితీమయమైన ప్రాజెక్ట్ కాళేశ్వరమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా పారేది 30 వేల ఎకరాలని, కానీ బ్యాక్ వాటర్ ద్వారా మునిగేది మాత్రం 40 వేల ఎకరాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా టన్స్ ఆఫ్ మిలియన్ క్యాష్ దోచుకున్న కేసీఆర్ మహారాష్ట్ర, ఢిల్లీలో ఆ డబ్బునే వాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కోటి తాగుబోతుల వీణగా మార్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ను కరప్షన్ సెంటర్ గా మార్చారని మండిపడ్డారు. గుజరాత్, తెలంగాణను కేసీఆర్ పోలుస్తున్నారని, అక్కడ మద్యపాన నిషేధం ఉందని, తెలంగాణలో దాన్ని అమలు చేసే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశ రాజకీయాలు చేస్తున్నారని, కానీ అబ్ కీ బార్ కుటుంబ సర్కార్ ఆయన అసలు నినాదమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
Next Story