మృత శిశువు లభ్యతపై అంతులేని అనుమానాలు.!

by Disha Web Desk 11 |
మృత శిశువు లభ్యతపై అంతులేని అనుమానాలు.!
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు బాత్రూంలో మృత శిశువు లభ్యతపై అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిశ ప్రచురించిన కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అందరూ క్షేమంగానే ఉండడంతో బయట నుంచి వచ్చిన వ్యక్తులే అయి ఉంటారని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు.

దీంతో పాటు సుమారు నాలుగు నుంచి ఐదు నెలల (బాబు) గర్భస్థ శిశువు అయ్యుంటాడని వైద్యులు అంచనా వేశారు. దీంతో పాటు అబార్షన్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా ప్రభుత్వాసుపత్రిలో అబార్షన్ చేసే వెసులుబాటు ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం కావడంతో ఉద్యోగులు సిబ్బంది ఆ సాహసానికి వడిగట్టే పరిస్థితి లేదని వైద్యాధికారులు తెగేసి చెబుతున్నారు. అదే రోజు ఆస్పత్రిలో గర్భిణీలకు జనరల్ ఓపీ నిర్వహించడంతో ఓపీ ద్వారా 88 మంది గర్భిణీలు పరీక్షలు జరుపుకున్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల ఆశ ఏఎన్ఎంలా సాయంతో సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. దీంతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగుల కదలికలను సీసీ కెమెరాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

'దిశ'లో కథనం ప్రచురించడంతో..

ఆస్పత్రిలో మృత శిశువు లభ్యతపై దిశ ప్రచురించిన కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ స్పందిస్తూ పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా జనరల్ ఆస్పత్రిలో విచారణ కమిటీని యమించారు. మృత శిశువుకు పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు అందజేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.

అబార్షన్ జరిగి ఉంటుందా..?

రాష్ట్ర ప్రభుత్వం అర్హత లేని ఆర్ఎంపీ, పీఎంపీలు మున్నాభాయ్ ఎంబీబీఎస్ అవతారమెత్తి కార్పొరేట్ రేంజ్ లో ఆసుపత్రిలను నిర్మించుకొని వచ్చిరాని వైద్యంతో అమాయక పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అర్హత లేని వారిపై చర్యలు తీసుకొని వచ్చిరాని వైద్యం చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. వైద్య అధికారులు తనిఖీలు నిర్వహించి కొంత కట్టడి చేశారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ప్రజాప్రతినిధులు ఎంటరై ఆర్ఎంపీలు, పీఎంపీల జోలికి వెళ్లొద్దని జిల్లా వైద్యాధికారులకు పరోక్ష ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులపాటు ప్రథమ చికిత్సకే పరిమితమై నిశ్శబ్దంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలు ఏకంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేసేందుకు సాహసిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అర్హత లేకపోయినా ఆపరేషన్లు, అబార్షన్లు చేస్తూ గల్లా పెట్టెలను నింపుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా జనరల్ ఆస్పత్రికి ఎదురుగా ఉండే ప్రైవేట్ ఆర్ఎంపీ, పీఎంపీ ఆస్పత్రి నుంచి అబార్షన్ జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ సంబంధాలు లేదా చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి వ్యక్తులకు మాత్రల ద్వారా అబార్షన్ జరిపి ఉంటారని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి బాత్రూంలోకి వెళ్లి మృత శిశువును అక్కడే వదిలి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా నూతనంగా ప్రారంభించబడిన మెడికల్ కళాశాల, జిల్లా జనరల్ ఆస్పత్రిలోనే ఈ దుర్ఘటన వెలుగు చూడటంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.


Next Story

Most Viewed