Electric ambulances:డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి విద్యుత్ అంబులెన్స్‌లు

by Jakkula Mamatha |
Electric ambulances:డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి విద్యుత్ అంబులెన్స్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ పునరుద్ధరణ పనుల ఆలస్యానికి చెక్ పడనుంది. మరమ్మతు పనుల్లో జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా త్వరలోనే విద్యుత్ అంబులెన్సులు ఫీల్డులోకి దించనున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 101 అత్యాధునిక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వెహికిల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి ఈ వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్టోబర్ నెలలో లాంఛ్ చేశారు. కాగా వాటి సేవలు డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 57 సబ్ డివిజన్లకు ఒక్కోటి చొప్పున కేటాయిస్తామని చెప్పిన సర్కార్ ఫీల్డులో వాటి అవసరాన్ని గుర్తించి 101 వాహనాలకు పెంచింది.

ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగినప్పుడు కానీ, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు గానీ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధణ పనులను వేగవంతంగా పూర్తి చేసి సరఫరా జరిగేలా ఈ అత్యాధునిక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాహనాలు పనిచేయనున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తన పరిధిలోని వివిధ విభాగాల్లో అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాహనాలను వినియోగించనుంది.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వెహికల్ లో షిఫ్ట్ విధానంలో ఒక అసిస్టెంట్ ఇంజినీర్, ముగ్గురు నైపుణ్యం కలిగిన సిబ్బంది విధుల్లో ఉంటారు. వారికి కావాల్సిన పరికరాలన్నీ అందులోనే ఉండనున్నాయి. వాహనంలో వాకీ టాకీ, థెర్మో విజన్ కెమెరాలతో పాటు, అత్యాధునిక భద్రతా పరికరాలైన హెల్మెట్, ఎర్త్ రాడ్, గ్లౌజులు, సేఫ్టీ బెల్ట్, కండక్టర్, ఎల్టీ/హెచ్‌టీ కేబుల్, స్పానర్ కిట్, 14 అడుగుల ఎత్తుగల అడ్జెస్టబుల్ నిచ్చెన, గొడ్డలి, రోప్, ఎల్టీ/హెచ్‌టీ ఫ్యూజ్ వైర్, ఇన్సుల్టేర్, వుడ్ కట్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఈ వాహనంలో నలుగురు సిబ్బంది సౌకర్యవంతంగా ప్రయాణించడం తో పాటు, 100 కేవీఏ సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్‌ను సైతం తరలించడానికి అనుకూలంగా ఉంటుంది.

గత నెలలో ప్రవేశపెట్టిన వాహనాల పనితీరు, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, ఎస్పీడీసీఎల్ సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న వాహనాలకు అదనంగా వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా మొత్తం 101 వాహనాల్లో ఒక్క మెట్రోజోన్ పరిధిలోనే 50 వాహనాలను వినియోగించనున్నారు. అలాగే రంగారెడ్డి జోన్ కు 21, మేడ్చల్ జోన్ కు 19, రూరల్ జోన్ కు 11 కేటాయించనున్నట్లు ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ స్పష్టంచేశారు. ఈ వాహనాలు వచ్చే నెల 1 నుంచి క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో విద్యుత్ పునరుద్ధరణకు పట్టే సమయం భారీగా తగ్గనుంది. త్వరితగతిన రిపేర్లు పూర్తి చేసి కరెంట్ సరఫరా జరిగేలా ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

Advertisement

Next Story