Demonetisation 2.0 :ట్యాక్స్ కలెక్షన్‌పై రూ.2 వేల నోటు ఎఫెక్ట్

by Disha Web Desk 6 |
Demonetisation 2.0 :ట్యాక్స్ కలెక్షన్‌పై రూ.2 వేల నోటు ఎఫెక్ట్
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ రూ.2 వేల నోటు రద్దు పుణ్యమాని పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీలు వేయటంతో కలెక్షన్ బాగా తగ్గిందంటూ నిరాశ వ్యక్తం చేస్తున్న జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఇప్పుడు రూ.2 వేల నోటు రద్దు కారణంగా కలెక్షన్ పెరుగుతుందన్న ధీమా పెరిగింది. ముఖ్యంగా రూ.2 వేల నోటుకు సంబంధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుల్లో ఒక ఖాతాదారు ఒక లావాదేవీలకు సంబంధించి కేవలం పది నోట్లను మాత్రమే డిపాజిట్ చేసే అవకాశం కల్పించటంతో బ్యాంక్‌కు వెళ్లి డిపాజిట్ చేసే టైమ్ లేని వారు వర్తమాన ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలుగా రూ.2 వేల నోట్లను జమ చేసేందుకు నగరవాసులు సముఖతను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

పైగా బ్యాంక్‌లో నోట్లు డిపాజిట్ చేసేందుకు ఎక్కువ మంది ఖాతాదారులు వచ్చే అవకాశముండటంతో జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్‌కు గానీ, సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో గానీ ఆస్తిపన్ను చెల్లించి, రూ.2 వేల నోట్లను వదిలించుకోవాలని భావించే వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గతంలో 2016లో రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దయిన సమయంలోనూ జీహెచ్ఎంసీకి భారీగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ వచ్చింది. అప్పట్లో రెండు రకాల పెద్ద నోట్లను రద్దు చేస్తే వచ్చినంత కలెక్షన్ కాకపోయినా అందులో సగం వరకు కలెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నెలాఖరు కల్లా రూ.వెయ్యి కోట్లు దాటేనా?

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పటి వరకు సుమారు రూ.790 కోట్ల వరకు వసూలైనట్లు సమాచారం. ఇందులో రూ.751 కోట్ల కేవలం ఏప్రిల్‌లో అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీమ్ ద్వారా వచ్చిన కలెక్షన్. ఇప్పుడు తాజాగా రూ.2 వేల నోటును ఆర్బీఐ రద్దు చేయడంతో ఆ నోట్ల ద్వారా ఆస్తి పన్ను చెల్లింపులు పెరిగి జీహెచ్ఎంసీకి ఈ నెలాఖరు కల్లా రూ.200 కోట్ల వరకు అదనపు కలెక్షన్ సమకూరి ఆస్తి పన్ను రూ.వెయ్యి కోట్ల దాటనున్నట్లు జీహెచ్ఎంసీ భావిస్తుంది.




Next Story

Most Viewed