ఈడీ టార్గెట్ @పార్టీ ఫండ్

by Rajesh |
ఈడీ టార్గెట్ @పార్టీ ఫండ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రులపై ఈడీ, ఐటీ ముప్పేటా దాడి చేస్తున్నాయి. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతోనే బీజేపీ తమను టార్గెట్ చేసిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తప్పు చేయనప్పుడు భయమెందుకని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గంగుల గ్రానైట్ సంస్థలు విదేశాలకు పెద్ద మొత్తంలో గ్రానైట్ సరఫరా చేస్తున్నాయని పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించకుండా లావాదేవీలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల ఈడీ, ఐటీ దాడులు నిర్వహించాయి. మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో లెక్కలు చూపకుండా వంద కోట్లు డొనేషన్ల రూపంలో పొందారని వాటికి రశీదులు ఇవ్వలేదని ఐటీ రెండు రోజులు కేంద్ర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీం బందోబస్తు నడుమ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవరహారంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కట్టడి చేసే వ్యుహం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగా మూడోసారి ఎలాగైనా ఆ పార్టీని నిలువరించాలనేదే ఈ దాడుల వెనుక అసలు వ్యుహాం అని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ అందించే కీలక నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చర్చ సాగుతోంది.

అందుకే దాడులా..

అందులో భాగంగానే మల్లారెడ్డి, గంగుల కమలాకర్ లపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నట్లు ఆఫ్ ది రికార్డు వినిపిస్తోంది. తలసాని సోదరులను సైతం ఇటీవల క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారించింది.ఉద్యమకారులు, ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని వీళ్లకి మంత్రి పదవి ఇవ్వడం వెనుక అసలు కారణం ఇదే అనే టాక్ నడుస్తోంది. ఎన్నికలు అత్యంత ఖరీదుగా మారిన నేపథ్యంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా నడుస్తోంది. కీలక నేతలను ఓడించే విషయంలో ఈ మొత్తం రెండింతలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వీరితో పాటు ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు తెలిపే వారిపై కూడా ఐటీ, ఈడీ నజర్ వెసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న రాష్ట్రానికి చెందిన కీలక వ్యక్తులు సైతం పార్టీకి పరోక్షంగా సహకరించడంతోనే వారికి ఢిల్లీ మద్యం పాలసీ కీలక ఒప్పందంలో ఛాన్స్ దొరికినట్లు సమాచారం.

పార్టీకి బ్యాక్ బోన్‌లా..

ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కారణంగా కీలక వ్యక్తులు పార్టీకి బ్యాక్ బోన్‌లా నిలుస్తున్నారట. కీలక వ్యక్తులు రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలకు సహకారం అందించి పార్టీ అధికారంలోకి వచ్చాక తమ పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. కీలక వ్యక్తులను కట్టడి చేయడంతో పాటు రాజకీయ నాయకులకు ఈడీ, ఐటీ దాడుల వలన ప్రతిష్ట దెబ్బ తింటుందని దీంతో మొత్తంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ మొత్తం ఎపిసోడ్ ప్రభుత్వ లోపాలను పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ అని అభిప్రాయపడుతోంది. టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ముఖ్య నేతలు విమర్శిస్తున్నారు. కొంత మంది ముఖ్య నేతల్లో మాత్రం తమపై ఎప్పుడు ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయో అనే భయం నెలకొంది. మరి కొంత మంది ముఖ్యనేతలపై ఈ దాడులు జరగనున్నట్లు సమాచారం. స్వయానా ముఖ్యమంత్రి సైతం ఈడీ, ఐటీ దాడులు ఎవరిపైనైనా జరగొచ్చు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సమావేశంలో సూచించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మరి ఈ దాడులతో అధికార పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందా.. లేక ప్రజల్లో సానుభూతి ఏర్పరుస్తుందా అనేది తేలాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more:

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మిస్సింగ్..? సీబీఐ అదుపులో ఉన్నాడా..?

Next Story

Most Viewed