సిసోడియాపైనే ఈడీ ఫోకస్.. కవిత ఎంక్వయిరీపై ‘నో’ క్లారిటీ (వీడియో)

by Disha Web Desk 4 |
సిసోడియాపైనే ఈడీ ఫోకస్..  కవిత ఎంక్వయిరీపై ‘నో’ క్లారిటీ (వీడియో)
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. కేసులో భాగంగా మూడో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను గతనెల 27న స్పెషల్ కోర్టుకు ఈడీ సమర్పించింది. దానిని కోర్టు మంగళవారం కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిసోడియా సౌత్ గ్రూప్‌తో కుమ్మక్కయ్యారని అభియోగం మోపిన ఈడీ.. రూ.20, 50 నోట్లతో హవాలా లావాదేవీలు జరిగినట్టు అందులో ప్రస్తావించింది. నిందితుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన అధికారులు.. ఆ విషయాలను ఈ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. కానీ కవిత ఎంక్వయిరీని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాపై ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. గత నెల 27న ఈడీ సమర్పించిన చార్జిషీట్‌ను రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు మంగళవారం కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ ఉల్లంఘనలపై దర్యాప్తు జరిపిన ఈడీ మొత్తం 29 మందిని నిందితులుగా పేర్కొన్నది. అందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా 29వ నిందితుడు.

ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మందిని అరెస్టు చేయడంతో వారిలో శరత్‌చంద్రారెడ్డి మినహా మిగిలినవారంతా ఇప్పటికీ తీహార్ జైల్లోనే ఉన్నారు. సిసోడియాను పలుమార్లు ఎంక్వయిరీ చేసిన తర్వాత ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మొత్తం 51 మందిని వేర్వేరుగా ఎంక్వయిరీ చేసిన ఈడీ అధికారులు 49 మంది నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. వారు వెల్లడించిన అంశాలను తాజా సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఎక్సయిజ్ పాలసీలో సౌత్ గ్రూపుతో జరిగిన సంప్రదింపులు, వాట్సాప్ సంభాషణలు, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లను అందులో జతపరిచింది.

ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో సౌత్ గ్రూపు సభ్యులతో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కుమ్మక్కయ్యారని చార్జిషీట్‌లో ఆరోపించిన ఈడీ.. పాలసీ ముసాయిదా దశలో ఉన్నప్పుడు సౌత్ గ్రూపు సభ్యులకు మొబైల్ ఫోన్ల ద్వారా చేరిందని పేర్కొన్నది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నది. కవిత తరఫున అరుణ్ రామచంద్ర పిళ్లయ్, ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబు, బోయిన్‌పల్లి అభిషేక్ ప్రతినిధులుగా వ్యవహరించారని ఆరోపించింది. సౌత్ గ్రూపుతో సిసోడియా టచ్‌లో ఉన్నారని, విజయ్ నాయర్ ద్వారా మొత్తం కుట్ర జరిగిందని పేర్కొన్నది.

రూ.20, 50 నోట్ల నంబర్లతోనే హవాలా లావాదేవీలు

పాలసీ రూపకల్పనలో భాగంగా సౌత్ గ్రూపు సభ్యులతో హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో పలు హోటళ్లు, అపార్టుమెంట్లలో జరిగిన సమావేశాల్లో చర్చించిన అంశాలు పలువురి స్టేట్‌మెంట్లలో వ్యక్తమైనట్టు ఈడీ అందులో పేర్కొన్నది. పాలసీని అనుకూలంగా మార్చినందుకుగాను సౌత్ గ్రూపు నుంచి రూ.100 కోట్ల మేర అడ్వాన్స్ కిక్ బ్యాక్ రూపంలో ఆప్‌కు చేరినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నది. సౌత్ గ్రూపు తరఫున బోయిన్‌పల్లి అభిషేక్ ద్వారా ఆప్ పార్టీ ప్రతినిధిగా విజయ్‌నాయర్‌కు చేరాయని వివరించింది.

ఇందులో రూ.31 కోట్లు దినేశ్ అరోరాకు హవాలా మార్గంలో చేరాయని, ప్రధాన కుట్రదారు మనీష్ సిసోడియాయేనని ఈడీ స్పష్టం చేసింది. హవాలా లావాదేవీల్లో రూ.20 (నం.65-ఏ-170809), రూ. 50 (నం.7-ఈడబ్ల్యు-645315) నోట్ల నంబర్లను కన్ఫర్మేషన్ కోసం వినియోగించినట్టు ఈడీ తెలిపింది. గోవా ఎన్నికల కోసం హవాలా మార్గంలో ఈ డబ్బు తరలిందని, ఆప్ కార్యకర్త మహేందర్ చౌదరి మొబైల్ ఫోన్‌లో ఈ రెండు నోట్ల ఇమేజ్‌లు ఉన్నాయని వివరించింది.

కవితతో పొలిటికల్ అండర్‌స్టాండింగ్

సౌత్ గ్రూపుతో సిసోడియా తరఫున మొత్తం వ్యవహారం నడిపింది విజయ్ నాయర్ అని పేర్కొన్న ఈడీ.. కవిత కూడా ఆయనతో రెండుసార్లు భేటీ అయిందని తెలిపింది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో 2022 ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో విజయ్ నాయర్, దినేశ్ అరోరాతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఆమె ప్రతినిధులైన అరుణ్ పిళ్లయ్, బుచ్చిబాబు కూడా పాల్గొన్నారని.. ఈ విషయాన్ని పిళ్లయ్ (నవంబరు 11,2022), దినేశ్ అరోరా (అక్టోబరు 3, 2022) వారి స్టేట్‌మెంట్లలో పేర్కొన్నారని తెలిపింది.

రూ.100 కోట్లు సౌత్ గ్రూపు నుంచి వెళ్లిన అంశాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోనూ పిళ్లయ్ మరోసారి ధ్రువీకరించారని పేర్కొన్నది. ఎక్సయిజ్ పాలసీ కాపీ క్యాబినెట్‌కు వెళ్లడానికి రెండు రోజుల ముందే బుచ్చిబాబు మొబైల్‌లోకి వచ్చిందని పేర్కొన్నది. ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా మధ్య పొలిటికల్ అండర్‌స్టాండింగ్ ఉన్నట్టు ఆమె ప్రతినిధిగా వ్యవహరించిన బుచ్చిబాబు తన స్టేట్‌మెంట్ (23 ఫిబ్రవరి 2023)లో పేర్కొన్నట్టు ఈడీ ఈ చార్జిషీట్‌లో పేర్కొన్నది.

సిసోడియా ప్రతినిధి విజయ్ నాయర్‌ను కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో కలిసి పాలసీ అంశాన్ని చర్చించిన విషయాన్ని పేర్కొన్నది. ఆ తర్వాతనే హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో జూన్‌ (2021)లో మీటింగ్ జరిగిందని ఈడీ వివరించింది. సౌత్ గ్రూపుతో ఆమ్ ఆద్మీ పార్టీకి అరేంజ్‌మెంట్ కుదిరిన తర్వాతనే ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాల విషయం ఖరారైందని పేర్కొన్నది. కిక్ బ్యాక్ రూపంలో ముడుపులు అందుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ఉద్దేశమని, రికవరీ పేరుతో లాభాలను ఆర్జించడం సౌత్ గ్రూపు లక్ష్యమని ఈడీ తన దర్యాప్తులో తేల్చిన అంశాన్ని పేర్కొన్నది.

కవిత ఎంక్వయిరీని ప్రస్తావించని ఈడీ

లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు ఇటీవల ముగించిన దర్యాప్తు వరకు చార్జిషీట్‌లో అనేక అంశాలను పొందుపరిచిన ఈడీ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మూడుసార్లు విచారణకు పిలిచిన విషయాన్ని ప్రస్తావించలేదు. ఆమె నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అంశాన్నీ పేర్కొనలేదు. మొత్తం 49 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేశామని, 51 మందిని విచారించామని చార్జిషీట్‌లో పేర్లతో సహా వివరించింది.

కానీ మార్చి 11, 20, 21 తేదీల్లో కవితను ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50(4) ప్రకారం విచారించిన అంశాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. సౌత్ గ్రూపులో మెంబర్‌గా ఉన్న కవితకు అరుణ్ పిళ్లయ్, బుచ్చిబాబు, బోయిన్‌పల్లి అభిషేక్ ప్రతినిధులుగా వ్యవహరించారని ఈడీ తన దర్యాప్తు అంశాలను పేర్కొనడంతో పాటు ఆ ముగ్గురి స్టేట్‌మెంట్లనూ ప్రస్తావించింది. సీబీఐ ఇప్పటివరకు రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన రెండు చార్జిషీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించలేదు.Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story