Lasya Nanditha : లాస్య నందిత మృతిపై అనుమానాలు!..ప్రమాదమా..మరేదైనా కారణమా?

by Disha Web Desk 13 |
Lasya Nanditha : లాస్య నందిత మృతిపై అనుమానాలు!..ప్రమాదమా..మరేదైనా కారణమా?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్/సికింద్రాబాద్/శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై అనేక అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టిందా? లేక విధి ఆమెను వెంటాడిందా?.. అసలేం జరిగింది? ఇది ప్రమాదమా లేక మరేదైనా జరిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో జోరుగా వ్యక్తం అవుతున్నాయి. లాస్య నందిత కారు ప్రమాదంపై పూర్తి విషయాలు ఇంకా తెలియనప్పటికీ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీ కొట్టిందని భావిస్తే కారు పల్టీలు కొట్టాలి కదా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెయిలింగ్‌ను ఢీకొనడానికి ముందే కారు ముందున్న మరో భారీ వాహనాన్ని ఢీ కొట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీటర్ బోర్డు 100 కి.మీ స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తులో ఏం తేలుతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు, ఆమె అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే..!

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణించిన కారు అంత సేఫ్ కాదా అనే వాదన తెరపైకి వస్తోంది. మారుతీ సుజుకీ XL6లో సేఫ్టీ తక్కువగా ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మరో వైపు నార్కట్‌పల్లిలో నందిత స్కార్పియో ప్రమాదానికి గురైన తర్వాత డ్రైవర్‌ను మార్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాన్ని ఆమె అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో పీఏ ముందు వరుసలో కూర్చోగా వెనుక మిడిల్ సీటులో లాస్య కూర్చున్నారని, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ఆమె తల సీటును బలంగా ఢీకొని మరణించారని భావిస్తున్నారు.

‘బాబా’ దగ్గరకు వెళ్లారా?

ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల తన కుటుంబసభ్యులతో కలిసి సదాశివపేట దర్గాలో బాబా దగ్గర ప్రత్యేక పూజలు చేయించడానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నది. అనంతరం ఆమె కుటుంబం మూసాపేట వెళ్లిపోయారని, అయితే మరోసారి సదాశివపేటకు ఎమ్మెల్యే, పీఏ ఆకాశ్ వెళ్లారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. దీంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.

ఐదురోజుల క్రితమే సాయన్న వర్ధంతి..

కంటోన్మెంట్ దివంగత శాసన సభ్యులు సాయన్న గతేడాది ఫిబ్రవరి 19న కన్ను మూశారు. సరిగ్గా ఏడాది క్రితం గుండె, కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నుమూశారు. అనంతరం తండ్రి స్థానంలో లాస్య నందిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమె చురుకుగా పాల్గొన్నారు.

దోమలగూడకు తరలుతున్న నేతలు..

గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే మృతదేహాన్ని అశోక్ నగర్ దోమలగూడలోని స్వగృహానికి తరలించారు. మరికాసపట్లో కేసీఆర్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నివాళులర్పించనున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోమలగూడకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. అంతకుముందు ఆస్పత్రికి వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నేతలు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోవ లక్ష్మి తదితరులు పోస్టుమార్టం అయ్యేవరకు అక్కడే వేచి ఉన్నారు.

అన్ని పార్టీల నేతల దిగ్భ్రాంతి

లాస్య నందిత మృతిపై అన్ని పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. యువ ఎమ్మెల్యే అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.

Next Story

Most Viewed