ఆరుతో పాటు ఆ మూడు గ్యారెంటీలు కూడా ఇవ్వండి: కాంగ్రెస్ పార్టీపై డీకే అరుణ సెటైర్

by Disha Web Desk 19 |
ఆరుతో పాటు ఆ మూడు గ్యారెంటీలు కూడా ఇవ్వండి: కాంగ్రెస్ పార్టీపై డీకే అరుణ సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలకు మోసం చేసేందుకు సిద్ధమైందని, హస్తం పార్టీ ఆ ఆరు గ్యారెంటీలతో పాటు మరో మూడు గ్యారెంటీలు కూడా ప్రజలకు ఇవ్వాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సూచించారు. అందులో తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారబోరని, తాము అధికారంలోకి వస్తే స్కాంలు ఉండబోవని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమనే మూడు గ్యారెంటీలు కూడా ఇస్తే బాగుంటుందని డీకే అరున ఎద్దేవాచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె విమర్శలు చేశారు.

సాధారణ వ్యక్తి ప్రధాని అవ్వడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆమె ధ్వజమెత్తారు. గాంధీ పేరు పెట్టుకొని రాజకీయాలు చేసిన కాంగ్రెస్ నేడు దేశ వ్యాప్తంగా విశ్వాసం కోల్పోయిందని మండిపడ్డారు. మత చిచ్చులతో లబ్ధి పొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అధికారం కోసం ఆరాటం తప్పితే.. కాంగ్రెస్‌కు దేశం మీద చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని, మరి అమలు చేస్తున్నారా? అని డీకే అరుణ ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? అని అరుణ నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎందుకు అమలు చేయడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి గురించి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలని, ముందు ఎంత దూరమైనా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పి ఇప్పుడేమో 30 కిలోమీటర్ల లిమిట్ పెట్టారని ఆమె విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని మోసం చేసేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నేతల ఆటలు సాగబోవని అరుణ హెచ్చరించారు.

ఎమ్మెల్సీ కవిత లేఖతో ప్రధాని మోడీ మహిళా బిల్లు ప్రవేశపెట్టారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని డీకే అరుణ ఎద్దేవాచేశారు. తనపైన ఉన్న ఆరోపణలు పక్కదారి పట్టించేందుకే ఇలాంటి నాటకాలాడుతోందని విమర్శించారు. ముందు మహిళలను గౌరవించమని కేసీఆర్‌కు చెప్పాలని డీకే అరుణ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కమిటీలో కీలకమైన స్థానాల్లో మహిళలు ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్‌కు చెప్పి మహిళలకు పదవులు కట్టబెట్టాలని డిమాండ్ చేయాలని పేర్కొన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో తన శ్రమ ఉందని, ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసని, అలాంటిది తనను గౌరవించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు తిట్టారని అరుణ ఫైరయ్యారు. కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆమె చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తోడు దొంగలని విమర్శలు చేశారు.



Next Story