తొమ్మిది నుంచి గొర్రెల పంపిణీ.. నకిరేకల్ నుంచి రెండో విడత పంపిణీ ప్రారంభం

by Disha Web Desk 5 |
తొమ్మిది నుంచి గొర్రెల పంపిణీ.. నకిరేకల్ నుంచి రెండో విడత పంపిణీ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 9న నకిరేకల్ లో రెండోవిడుత గొర్రెల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు నూతనంగా ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకొచ్చే గొర్రెలకు అవసరమైన మందులు, దాణా, ఇన్సురెన్స్ ట్యాగ్ లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 8,9,10 తేదీలలో మూడ్రోజులపాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ ఫిష్ పుడ్ ఫెస్టివల్ 8న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించడం జరుగుతందన్నారు. ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాల్లో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యక్రమాలపై సమగ్ర కార్యాచరణను రూపొందించి జిల్లా, మండల అధికారులకు పంపించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్బంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా డెయిరీ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, పర్యవేక్షణ చేయాలన్నారు. 8న చెరువుల పండుగ సందర్బంగా ప్రధాన చెరువులు, రిజర్వాయర్ ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ ఇతర పథకాలపై ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు, ఫోటో ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈఓ సీఈఓ మంజువాణి తదితరులు పాల్గొన్నారు.Next Story