కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ''కరెంట్'' చిచ్చు.. సీఎం కేసీఆర్ ఆగ్రహం

by Disha Web Desk 19 |
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కరెంట్ చిచ్చు.. సీఎం కేసీఆర్ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కరెంటు మంటలు అంటుకున్నాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని ఇంతకాలం తెలంగాణ సర్కారు ఆరోపణలు చేసింది. సంస్కరణలను అమలుచేస్తే కేంద్రం నుంచి వచ్చే రూ. 25 వేల కోట్ల (రానున్న ఐదేళ్ళలో) మేర నష్టం జరిగినా ఫర్వాలేదుగానీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని అసెంబ్లీ వేదికగానే సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు పడిన బకాయిలను దృష్టిలో పెట్టుకుని పవర్ ఎక్ఛేంజిపై పట్టు బిగించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కరెంటు విక్రయాలు, కొనుగోళ్ళపై ఆంక్షలు పెట్టింది. ఆ ఎఫెక్ట్ తెలంగాణలో విద్యుత్ సరఫరాపై రానున్న రోజుల్లో కనిపించనున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి తప్పుపట్టగా విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి దేశద్రోహపూరిత చర్యగా అభివర్ణించారు.

కేంద్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఒకటి రెండు రోజుల్లో కరెంటు కోతలకు ఆస్కారం ఉన్నదని, వినియోగదారులు సహకరించాలని తెలంగాణ ట్రాన్స్ కో – జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యవసాయ పంపుసెట్ల వాడకం ఎక్కువగా ఉంటున్నందున ఆ సమయంలో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉన్నదని వివరించారు. పవర్ ఎక్ఛేంజి నుంచి కరెంటు కొనకుండా ఆంక్షలు అమలులోకి వచ్చినందున శుక్రవారం ఒక్క యూనిట్ కూడా కొనలేకపోయామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జల, థర్మల్, సౌర విద్యుత్‌ను గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి వినియోగించుకుంటున్నామని వివరించారు. విద్యుత్ కోతలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమో లేక రాష్ట్ర విద్యుత్ సంస్థలో కాదని, వీటి తప్పు కూడా లేదని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ విధానాలేనని ఆయన స్పష్టం చేశారు.

డిస్కంల బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఇటీవల విధించిన ఆంక్షలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో కరెంటు కోతలకు ఆస్కారం ఏర్పడింది. అనేక రాష్ట్రాలతో పాటు తెలంగాణకూ ఈ ఆంక్షలు తప్పకపోవడంతో శుక్రవారం పవర్ ఎక్ఛేంజి నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటును కొనలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా మొత్తం ఆరు రాష్ట్రాలకు విద్యుత్ బకాయిలను పూర్తిగా చెల్లించినందున కరెంటు కొనుగోళ్ళ ఆంక్షల నుంచి మినహాయింపు లభించింది.

తెలంగాణ విద్యుత్ సంస్థలు రోజుకు సగటున 20 మిలియన్ యూనిట్ల చొప్పున కొంటుంటాయి. కానీ ఆంక్షల కారణంగా శుక్రవారం మొత్తానికే సర్దుబాటు కాలేదు. ఈ ఎఫెక్ట్ ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంపై కనిపించే అవకాశం ఉన్నది. తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో శుక్రవారం జెన్‌కో సీఎండీ సహా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, వినియోగదారులకు వీలైనంతవరకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాల్సిందిగా సూచించారు. పవర్ ఎక్ఛేంజిపై కేంద్రం వైఖరిని తప్పుపట్టారు.

రాష్ట్రంలోని విద్యుత్ తాజా పరిస్థితిపైనా, అనూహ్యంగా ఎదురైన ఆంక్షలపైనా సీఎండీ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఒకటి రెండు రోజుల్లో కరెంటు సరఫరాలో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నదని, ప్రజలు సహకరించాలని కోరారు. పవర్ ఎక్ఛేంజి నుంచి కరెంటును కొనే అవకాశం లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వమే అయినందున రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని, వాటి తప్పు కూడా లేదన్నారు. కరెంటు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జల విద్యుత్, థర్మల్, సోలార్ విద్యుత్‌ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతన్నలు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే పవర్ ఎక్ఛేంజి నుంచి కరెంటు కొనుగోళ్ళు జరగకుండా రాష్ట్రానికి ఇబ్బందులు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే శుక్రవారం 20 మిలియన్ యూనిట్లను డ్రా చేయలేక పోయామన్నారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. నిజానికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, రాష్ట్ర డిస్కంలకు మధ్య పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఉంటాయని, ఆ ఒప్పందం ప్రకారం అవి అమ్మవచ్చని, డిస్కంలు కొనుక్కోవచ్చన్నారు. బకాయిగా ఉన్న రూ. 1360 కోట్లను పూర్తి స్థాయిలో చెల్లించినా కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు.

రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం 12,214 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరఫరాకు అంతరాయం రాకుండా చూడగలిగామన్నారు. ఒకటి రెండు రోజుల్లో రైతులకు, ప్రజలకు, వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు నెలల క్రితం తెలంగాణ విద్యుత్ సంస్థలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై స్టే ఉన్నప్పటికి కేంద్రం ఇలా చేయడం బాధాకరమన్నారు.

దేశద్రోహపూరిత చర్య : విద్యుత్ మంత్రి

విద్యుత్ సంస్థలపై కేంద్రప్రభుత్వం పెత్తనం తగదని రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగం కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశమని, విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండజాలదన్నారు. ఓపెన్ మార్కెట్ నుంచి తెలంగాణా ప్రభుత్వం కొంటున్న విద్యుత్‌పైనా, ఎక్ఛేంజిలో చేసే అమ్మకాలపైనా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ ఆంక్షల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిచాల్సి వస్తే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టు నుండి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు పొందిందని, అయినా కోర్టు తీర్పును ఉల్లంఘించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు బీజేపీ ఈ తరహా కుట్రలకు తెరలేపిందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన, దళిత గిరిజనులకు అందించే సబ్సిడీలను ఎత్తి వేయించడమే బీజేపీ ఎజెండా అని విమర్శించారు. రాష్ట్రాల పరిధిలోని అంశాలపై కూడా కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. వాస్తవాలను కప్పిపుచ్చి బకాయిల పేరుతో రాష్ట్రల హక్కులను హరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. తెలంగాణా ప్రభుత్వం ఒక్క రూపాయి కుడా బకాయి లేదని స్పష్టం చేశారు. డిస్కంలకు, విద్యుత్‌ను సరఫరా చేసే ఉత్పత్తి సంస్థలకు మధ్య కుదిరే ఒప్పందంలో కేంద్రం జోక్యం సహేతుకం కాదన్నారు. వీరిద్దరి మధ్య తగవులు వస్తే పరిష్కరించడానికి ఈఆర్‌సీ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లు) ఉన్నాయని, అప్పటికీ పరిష్కారం కాకుంటే కోర్టులు ఉన్నాయన్నారు.

తెలంగాణలో 24 గంటలూ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉన్నదని, వ్యవసాయ రంగానికి పూర్తిగా ఉచితంగానే లభిస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కరెంట్ కోతలు ఉండడడంతో అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భావనతో ఇలాంటి దుశ్చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షల పేరుతో తీసుకున్న నిర్ణయం దేశద్రోహ పూరితమైనదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed