దిశ@3: మూడేళ్ల సంచలనం..

by Disha Web Desk 2 |
దిశ@3: మూడేళ్ల సంచలనం..
X

మీడియా రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా దూసుకెళ్తున్న ‘దిశ’ దినపత్రిక ప్రారంభమై నేటికి సరిగ్గా మూడేళ్లు. కొవిడ్ మహమ్మారి ముంగిట 2020 మార్చ్ 7న పురుడు పోసుకుంది దిశ. ఒక్కొక్క అడుగే వేస్తూ, రోజుకో ప్రయోగం చేస్తూ దిగ్గజాలనదగ్గ మీడియా సంస్థలకు దీటుగా మార్కెట్‌లో నిలబడింది. ఎన్ని పేపర్లు చదివినా దిశ చదవకపోతే వెలితి ఫీలవుతున్నామని కామెంట్లు వచ్చేంతగా ఎదిగింది. అందరూ ఈరోజు వార్తలను రేప్పొద్దున ఇస్తే.. దిశ పేపర్ రేపటి, ఎల్లుండి వార్తలను ఈరోజే ఇస్తుందని ఓ ఎన్నారై మేధావి అనడం మా కష్టానికి గుర్తింపే.

దిశ డైనమిక్ ఎడిషన్లు తెలుగునాట సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. రెండేళ్ల కిందట ప్రారంభమైన ఈ డైనమిక్ కాన్సెప్ట్ ఇప్పుడు మార్కెట్‌ను కుదిపేస్తోంది. మూడు గంటలకోమారు వెలువడే ఈ పేజీల కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వీటిలో వచ్చే వార్తలను చూసి జర్నలిస్టులు తమ సాయంత్రం షెడ్యూలు సిద్ధం చేసుకుంటుంటే, మీటింగు ముగిసే లోపే తమ ప్రసంగాలు వార్తల రూపంలో రావడం నేతలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిస్థితి చివరకు ప్రధాన పత్రికలు సైతం డైనమిక్ ఎడిషన్లను తెచ్చే నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైంది.

దిశ ఈ-పేపర్‌కు, వెబ్‌సైట్‌కు కలిపి తెలంగాణ, ఏపీల్లో, ప్రపంచంలోని 192 దేశాల్లోనూ విస్తరించివున్న తెలుగు ప్రజల్లో నాలుగున్నర కోట్లకు పైగా యూనిక్ యూజర్ బేస్ ఉంది. మొబైల్‌లోనో, టాబ్‌లోనో, డెస్క్ టాప్ కంప్యూటర్‌లోనో ఒక్కసారైనా మా మీడియాకు రాని తెలుగింటి లోగిలి లేదంటే అతిశయోక్తి కాబోదు. వెబ్‌సైట్‌లో వచ్చే వార్తలు క్షణాల్లో వైరల్ అవుతాయి. డైనమిక్‌లో వచ్చే కథనాల క్లిప్‌లు సోషల్ మీడియాను ముంచెత్తుతాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఆ క్షణానికి ఏం జరిగిందో ముఖ్యాంశాలు పాఠకులను చేరతాయి.

సోషల్ మీడియా వేగం.. ప్రింట్ మీడియా విశ్వసనీయత.. దిశ సక్సెస్‌ మంత్రం. నిష్పాక్షికంగా, నిజాయితీగా వ్యవహరించడం.. వార్తల వెనకాల దాగివున్న వాస్తవాల పైన దృష్టి పెట్టడం.. దిశ మూలసూత్రం. పత్రిక అన్నది ప్రభుత్వానికి ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా ఉండాలన్నది దిశ ఎంచుకున్న విధానం. ఎన్ని ఒత్తిడులు ప్రయోగించినా, బెదిరింపులు వచ్చినా, ఆశలు చూపినా, బద్నాం చేయ యత్నించినా, తప్పుడు కేసులు బనాయించినా నమ్మిన దారిలోనే ముందుకు సాగడం దిశ నైజం.

వచ్చేది ఎన్నికల సంవత్సరం. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పాట్లు పడే కాలం. ఆచరణ సాధ్యం కాని హామీలతో, మంత్రముగ్ధుల్ని చేసే ప్రసంగాలతో, భ్రమింపజేసే నినాదాలతో, ఓటుకు నోటు విధానాలతో ప్రజల ముందుకు వచ్చే సందర్భం. ఇలాంటి కీలక సమయంలో దిశ తన కర్తవ్యాన్ని మరింత నిష్ఠతో నిర్వర్తిస్తుంది. వాస్తవాన్ని ప్రజల ముందుంచుతుంది. పీపుల్స్ ఎజెండాను రూపొందించడం పైన కేంద్రీకరిస్తుంది. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై ఫోకస్ చేస్తుంది.

నాలుగో ఏడాదిలో అడుగు పెడుతున్న వేళ పాఠకులు, ప్రకటనకర్తలు, స్వతంత్ర మీడియా వర్ధిల్లాలని కోరుకునే పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యోగులు, విద్యావంతులు, దాతలు మమ్మల్ని ఎప్పటిలాగే ఆదరించాలని, సహకరించాలని, సాయపడాలని విన్నవిస్తున్నాం. ఇది మీ మీడియా.. మనందరి మీడియా..


ఇక పైనా వాస్తవమే మా గమ్యం.. గమనం..

- డి మార్కండేయ

Next Story