హోటల్ ఫుడ్ తింటే.. రోగాలు గ్యారెంటీ

by Indraja |
హోటల్ ఫుడ్ తింటే.. రోగాలు గ్యారెంటీ
X

దిశ, శేరిలింగంపల్లి: నగరంలో మంచిపేరున్న హోటల్స్..నోరూరించే మెనూ..కంటికి ఇంపైన ఐటమ్స్..వండి వార్చేందుకు చెప్స్..వాటిని అంతే మర్యాదగా వడ్డించేందుకు వెయిటర్స్..ఇప్పుడు నగరంలో ఏ హోటల్‌కు వెళ్లినా ఇవన్నీ సర్వసాధారణంగా కనిపించే విషయాలు. ఇక పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ అని చెప్పుకునే వాటిలో రేట్లు కూడా వేలల్లో ఉంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే..నగర ప్రజలు రెస్టారెంట్లు, హోటల్స్‌లో తినడం అనేది ఓ స్టేటస్ సింబల్‌గా ఫీలవుతున్నారు.

ఐటీ ప్రొఫెషన్స్, ఇతర రంగాలలో పనిచేస్తున్న చాలామంది వీకెండ్ వచ్చింది అంటే చాలు ఇంట్లో స్టవ్ వెలిగించడం కూడా మానేశారు అంటే అతిశయోక్తి కాదు. హోటల్ ఫుడ్‌కు జనాలు అంతలా అలవాటుపడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్‌లలో నచ్చిన ఫుడ్ తినడం, వారంతాల్లో ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లడం సర్వసాధారణంగా మారింది.

పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కూడా హోటళ్లలో ఆర్డర్లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ మీకు మీరే మీకు తెలియకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, మీరు లొట్టలేసుకుంటూ తినే ఫుడ్ ఏమాత్రం నాణ్యమైనది కాదని, డబ్బులు ఇచ్చి మరీ కుళ్లిన ఫుడ్ తింటున్నారని, రోజుల తరబడి స్టోర్ చేసిన ఫుడ్‌ను తింటున్నారన్న విషయం ఫుడ్ సేఫ్టీ అధికారుల తాజా తనిఖీల్లో వెల్లడయింది. అంతేకాదు హోటల్‌లో పరిశుభ్రత గూర్చి తెలిస్తే తిన్నది బయటకు వచ్చేలా ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రుచిగా ఉందని లాగిస్తే..రోగాలు గ్యారెంటీ..

నగరంలో వేలాది రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లకు చాలా పేరుంది. అక్కడికి వెళ్లి గంటల తరబడి లైన్‌లో ఉండి, టేబుల్ రిజర్వ్ చేసుకుని నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కడుపునిండా లాగించేస్తారు భోజన ప్రియులు. కానీ మీరు తిన్న ఫుడ్ నాలుకకు ఎంతో రుచిగా ఉన్నా నాణ్యత విషయంలో ఏమాత్రం బాగలేకపోవచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు.

ఎందుకంటే గత వారం రోజులుగా నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్ ఇలా దేన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. అయితే పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలతో వంటలు చేస్తున్నారని, కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది.

బడా హోటల్స్ సైతం నాణ్యత పాటించడం లేదని, ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్స్, మసాలాలు వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు. నిషేధిత ఫుడ్ కలర్స్, రుచికోసం టేస్టింగ్ సాల్ట్స్ వాడకూడదన్న నిబంధనలు ఉన్నా వాటిని యథేచ్ఛగా వాడుతున్నట్లు తేలింది. వంటల్లో రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కష్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారనే చెప్పాలి.

పురుగులు పడిన చికెన్ ఫ్రైగా, పాచిపోయిన చికెన్‌ను తందూరి అంటూ కష్టమర్లకు వడ్డిస్తున్నారు. ఒక్క చికెనే కాదు, మటన్, చేపలు, రొయ్యలు, రోటీ, ఐస్ క్రీములు ఇలా అన్నీ కల్తీ చేసి వినియోగదారులకు కడుపు నిండా పెడుతూ రోగాల బారిన పడేటట్లు చేస్తున్నారు.

అసలు విషయం తెలిస్తే అటువైపు వెళ్ళరు..

ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం వడ్డిస్తూ వినియోగదారుల జేబులు ఖాళీ చేయడంతో పాటు హోటల్ నిర్వాహకులు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు. దాదాపు ప్రతి చోటా ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన మాంసం, వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

నగరంలో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటల్లో కూడా ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం దొరకని పరిస్థితి. ఓసారి వాడిన నూనెలను మళ్లీమళ్లీ వాడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని హోటల్స్ కిచెన్స్ మురుగు కాల్వల పక్కనే ఉన్నాయి. ఫైవ్‌స్టార్ ఫుడ్ కోర్టులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, బేకరీలు, ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

పేరు పెద్ద..నాణ్యత అద్వాన్నం..

ప్రముఖ హోటళ్లల్లోనూ ఆహారం రుచిగా ఉండేందుకు సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే చాలా హోటళ్లు, రెస్టారెంట్ల వంటగదుల్లో ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరగడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. రామేశ్వరం లాంటి ప్రముఖ హోటళ్లలో కూడా నిర్వాహకులు కక్కుర్తి పడుతున్నారు. ఇక్కడ గడువు ముగిసిన పెరుగు, మినపప్పు ఇతర పదార్థాలు వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.

క్రీమ్ స్టోన్, నాచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరే కేఫ్, హౌస్ రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌనింగ్ బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకోబెల్, ఆహా దక్షిణ్, సిజ్జల్ జో, ఖాన్సాబ్, హోటల్ సుఖ్ సాగర్ వెజ్ రెస్టారెంట్, జుంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, బిగ్ బాస్కెట్ ఇలా రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలో కూడా నాణ్యత లేని నాసిరకం ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తేలింది.

తస్మాత్ జాగ్రత్త..

హానికరమైన రంగులు, రసాయనాలు మనిషికి ప్రాణాంతక కేన్సర్ రావడానికి కారణమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. జీర్ణాశయం దెబ్బతిని అల్సర్ వచ్చే ప్రమాదం ఉందని, గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై పనిచేయడం మానేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చని, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, విరేచనాలు కలిగి మెదడు పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఆహారం రుచిగా ఉండేందుకు ఉపయోగించే రసాయనిక పదార్థాలు మెదడు, ఎముకలపై ప్రభావం చూపుతాయంటున్న డాక్టర్లు.. కల్తీ ఆహారంతో చర్మంపై దద్దులు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుందని బయట ఫుడ్ తినడం సాధ్యమైనంత వరకు మానుకోవాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed