కంటోన్మెంట్‌ ఉపఎన్నికపై ఫోకస్.. లాస్య కుటుంబానికి ఇచ్చేందుకు బీఆర్ఎస్ వెనకడుగు!

by Disha Web Desk 2 |
కంటోన్మెంట్‌ ఉపఎన్నికపై ఫోకస్.. లాస్య కుటుంబానికి ఇచ్చేందుకు బీఆర్ఎస్ వెనకడుగు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంటోన్మెంట్ ఉపఎన్నికపై బీఆర్ఎస్‌లో చర్చలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే, ఆ ఫ్యామిలీకే టికెట్ ఇవ్వడంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే లాస్య నందిత సోదరి నివేదిత శనివారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. టికెట్ ఇవ్వాలని రిక్వెస్టు చేశారు. నివేదితతో పాటు ఆమె తల్లి కూడా సమావేశమయ్యారు. పోటీకి సిద్ధంగా ఉన్నందున పార్టీ బీఫాం ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, కేసీఆర్ నుంచి స్పష్టత రాకపోవడంతో ఒకింత నిరాశతో ఆమె వెనుదిరిగారని సమాచారం. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీకి అసెంబ్లీ ఎన్నికలప్పుడే మన్నె క్రిశాంక్ ఆసక్తి చూపారు. కానీ, కేటీఆర్ బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు నివేదితకు టికెట్ ఇస్తే క్రిశాంక్ సహకరిస్తారా? అనే చర్చలు మొదలయ్యాయి.

డీకేతో మల్లారెడ్డి భేటీపై కేసీఆర్ ఆరా..

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి శనివారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరు ఇటీవల బెంగుళూరు వెళ్లి డిప్యూటీ సీఎం (కాంగ్రెస్) డీకే శివకుమార్‌తో భేటీ అవ్వగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మామ అల్లుళ్లు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధం అయ్యారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, మల్కాజిగిరి ఎంపీ సీటు ఎలాగైనా గెలవాల్సిందేనని కేసీఆర్ పార్టీ వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ స్థానం నుంచి తొలుత మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కేసీఆర్ భద్రారెడ్డికి ఎంపీ సీటు ఇస్తానని చెప్పి పోటీ చేయాలని సూచించినా మల్లారెడ్డి నో చెప్పారు. దీంతో కేసీఆర్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు టికెట్ కేటాయించారు. అయితే, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే పోటీకి దూరంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మల్లారెడ్డి పార్టీకి దూరమైతే మేడ్చల్ జిల్లాలో గులాబీ గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశమున్నట్లు టాక్. మరోవైపు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన భార్యతో కలిసి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

కవిత అరెస్టుపై కేటీఆర్, హరీశ్‌తో చర్చలు :

ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసిన పరిణామాలపై కేటీఆర్, హరీశ్‌రావులతో కేసీఆర్ చర్చించారు. గతంలో సీబీఐ అధికారులు కవితను ఆమె నివాసానికి వెళ్ళి ఇదే కేసులో ప్రశ్నించినప్పుడు కేసీఆర్ వెళ్ళి పలకరించలేదని, కవితనే ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడటం పార్టీలో చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈడీ అధికారులు ఆమె ఇంటికే వచ్చి విచారించిన తర్వాత అరెస్టు చేసినప్పుడు కూడా వెళ్ళకపోవడం, ఈ అంశంపై కామెంట్ చేయకుండా మౌనంగా ఉండటం కూడా విమర్శలకు దారితీసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని మీడియా సమావేశంలోనే ప్రస్తావించి కూతురి విషయంలో కేసీఆర్ మౌనం దేనికి సంకేతమంటూ ప్రశ్నించారు.

కవితను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో కేటీఆర్, హరీశ్‌రావులతో కేసీఆర్ మాట్లాడారు. అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పిలుపు మేరకు నిరసనలు, ఆందోళనలు జరిగాయి. వాటి గురించి ఆరా తీసిన కేసీఆర్... తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా వీరిద్దరితో చర్చించినట్లు తెలిసింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరికీ వివరించిన తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు వెళ్ళిపోయారు.

నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీశ్‌రావు :

కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావులు ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ సూచనల మేరకే వెళ్తున్నట్లు తెలిసింది. ఈడీ కస్టడీలో ఉన్న కవిత కుటుంబ సభ్యులను, లాయర్లను కలవడానికి కోర్టు వెసులుబాటు కల్పించింది. ప్రతి రోజూ సాయంత్రం 6-7 గంటల మధ్య కలిసేలా ఈడీ అధికారులు టైమ్ ఫిక్స్ చేశారు. ఆమె భర్త అనిల్ (ఢిల్లీలోనే ఉన్నారు), కొడుకు, సోదరుడు కేటీఆర్‌, హరీష్ రావు, పలువురు లాయర్లు ఆదివారం సాయంత్రం కవితను కలిసే అవకాశమున్నది.

Next Story