'ధరణి పోర్టల్‌ని రద్దు చేయాల్సిందే..'

by Disha Web |
ధరణి పోర్టల్‌ని రద్దు చేయాల్సిందే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తరతరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణా ప్రభుత్వం ధరణి పోర్టల్ ని ప్రవేశపెట్టింది. కానీ పాత సమస్యలు తీర్చకపోగా మరిన్ని కొత్త సమస్యలను సృష్టించిందని ధరణి పోర్టల్ సమస్యల పరిష్కార వేదిక కన్వీనర్, సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.79 కోట్ల సర్వే నంబర్లలో ఉన్న 2.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి గురించి, వాటిలో దశాబ్దాలుగా ఇమిడివున్న భూసమస్యల గురించి క్షేత్ర స్థాయిలో సరైన కసరత్తు చేయకుండా ఆగమేఘాల మీద ధరణి పోర్టల్ ను తీసుకువచ్చి ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపించారు. వంశపారంపర్యంగా తాము అనుభవిస్తున్న తమ భూమి తమది కాదని ధరణి పోర్టల్‌లో చూపించడంతో ధరణి చెర నుంచి ఎలా విడిపించుకోవాలో, తమ భూ సమస్యలను ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలోకి తెలంగాణా రైతులు నెట్టివేయబడ్డారన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల చుట్టు కాళ్ళు అరిగేలా తిరిగిన చాలా మంది రైతులు తమ భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో మానసిక వేదన అనుభవించి తనువులు చాలిస్తున్నారన్నారు. తెలంగాణలో భూమి బంగారం అయ్యిందని, ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఎక్కడికి వెళ్ళినా ఎకరం భూమి ధర రూ.40 లక్షలు పలుకుతోందని సీఎం కేసీఆర్ గొప్పలకు పోతున్నారన్నారు. అంతటి విలువైన భూమిపై రైతులకు యాజమాన్యపు హక్కులు కల్పించడంలో విఫలం అయ్యారని విమర్శించారు. భూ విస్తీర్ణంలో తప్పుడు వివరాల నమోదు కారణంగా రైతులకు భూములను చూపెట్టలేదు. భూమి లేని రైతు ఖాతాలో భూమిని చూపెట్టింది. తద్వారా గ్రామాల్లో రైతుల మధ్య చిచ్చు పెట్టిందన్నారు. ఇలా అనేక సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టడానికి చూపెట్టిన ఉత్సాహాన్ని దాని ద్వారా ఉత్పన్నమైన కొత్త సమస్యలకు పరిష్కారమార్గాలను వెతకడంలో చూపించలేదన్నారు. రైతుల గోస పెడుతున్న ధరణి పోర్టల్ ను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలి. లేని పక్షంలో భేషజాలకు పోకుండా ధరణిని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.


Next Story