ఏడాదిగా ‘ధరణి’ దరఖాస్తులు పెండింగ్.. ‘కమిటీ’ తేల్చేదాకా పరిష్కరించరా?

by Disha Web Desk 4 |
ఏడాదిగా ‘ధరణి’ దరఖాస్తులు పెండింగ్.. ‘కమిటీ’ తేల్చేదాకా పరిష్కరించరా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ఆఫీసర్లు ఆసక్తికనబర్చడం లేదు. దరఖాస్తులు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలన్న నిబంధనలే లేనట్టు వ్యవహరిస్తున్నారు. కొన్ని అప్లికేషన్లు రెండేండ్ల నుంచి పెండింగులో పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ధరణిలో సుమారు 2.36 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉంటే.. ఇప్పటికీ ఆ సంఖ్య దాదాపుగా అలాగే ఉన్నది. 70 రోజుల్లో పరిష్కారమైన అప్లికేషన్లు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా సీసీఎల్ఏ ఆఫీసులో పరిష్కారం చేయాల్సిన దరఖాస్తులే కావడం విశేషం.

అడ్డంకులేమిటి?

తహసీల్దార్లు రిపోర్టులు పంపి.. కలెక్టర్లు అప్రూవ్ చేసిన తర్వాత కూడా.. సీసీఎల్ఏలో అప్లికేషన్లను క్లియర్ చేయడానికి ఉన్న అడ్డంకులేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ధరణి కమిటీ రిపోర్టు ఇచ్చి కొత్త గైడ్ లైన్స్ వచ్చే వరకు దరఖాస్తులేవీ పరిష్కారం కావంటూ కొందరు కింది స్థాయి అధికారులు బాధిత రైతులకు చెప్తున్నారు. అయితే తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు అప్లికేషన్లను పెండింగ్‌లో పెట్టాలని రేవంత్ సర్కారు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

అప్లికేషన్లు పెండింగులో ఉంచాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కనీసం సిఫారసు కూడా చేయలేదని ధరణి కమిటీ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరి వీటిని క్లియర్ చేయకుండా తాత్సారం చేయడానికి కారణాలేమిటోనని ధరణి కమిటీ ఆరా తీస్తున్నది. కాగా, ఈ నెల 24న కలెక్టర్లతో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశం ప్రధానంగా ఉందని సభ్యుడొకరు ‘దిశ’కు తెలిపారు.

బాధిత రైతుల్లో అసహనం

సమస్యలు పరిష్కరించకుండా సామాన్య రైతులను ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం విడ్డూరంగా ఉందని రెవెన్యూ నిపుణులు పేర్కొంటున్నారు. పదెకరాలకు పైగా విస్తీర్ణానికి సంబంధించిన ఫైళ్లపై సర్కారు నిర్ణయం కోసం వేచి చూడొచ్చని.. కానీ ఎకరం నుంచి ఐదెకరాల విస్తీర్ణానికి సంబంధించిన వాటిపై కూడా నిర్ణయం తీసుకోకుండా దాటవేత ధోరణి అవలంభించడం పట్ల బాధిత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా పరిష్కారానికి రెండేండ్లకు పైగానే సమయం పడుతున్నదని వాపోతున్నారు.

‌‌పాజిటివ్ రిపోర్టులే..

దరఖాస్తు చేసుకున్నాక.. అది కలెక్టర్ లాగిన్ నుంచి తహసీల్దార్, అక్కడి నుంచి కలెక్టర్, మళ్లీ అక్కడి నుంచి సీసీఎల్ఏ వరకు చేరడానికి ఎన్ని నెలలు పడుతున్నదో అప్లయ్ చేసిన బాధిత రైతులకు బాగా తెలుసు. రిపోర్టు రాయించుకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు ఏమిటో గ్రామ స్థాయిలో ఎంక్వయిరీ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఆఖరికి పాజిటివ్ రిపోర్ట్.. ఉన్నది ఉన్నట్లుగా నివేదిక సమర్పించినా సమస్య పరిష్కారం కావడ లేదని రైతులు వాపోతున్నారు.

నల్లగొండ జిల్లాలో ఒకరు రికార్డులు, క్షేత్ర స్థాయిలో ల్యాండ్ చూసుకొని భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడేమో ఆర్ఎస్ఆర్ తేడా అంటూ సర్వే నంబరు ఎత్తేశారు. అక్కడ భూమి తన స్వాధీనంలోనే ఉన్నది. సేల్ డీడ్, మ్యుటేషన్ ఉన్నది. కొత్త పాసు బుక్ ఉన్నది. కానీ పోర్టల్ లో మాత్రం కనిపించడం లేదు. ఇది సరి చేయాలంటూ ఏండ్ల తరబడి తిరిగాడు. అతి కష్టం మీద సీసీఎల్ఏ వరకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ నెలలు గడుస్తున్నా అప్రూవ్ చేయకుండా పెండింగ్ లో పెట్టారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా ఉన్నాయి. కనీసం కలెక్టర్ అప్రూవ్ చేసినవైనా క్లియర్ చేయడానికి ఉన్న ఇబ్బందులు సీసీఎల్ఏకి ఏమున్నాయో అర్థం కావడం లేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఇలా..

ధరణి పోర్టల్ అమలైన తర్వాత ఏ సమస్యకు ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలో అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అవి ఇలా ఉన్నాయి..

అంశం సమయం

స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా ఆర్వోఆర్ కేసులు నెల రోజులు

పెండింగ్ మ్యుటేషన్ కేసులు వారం రోజులు

కంపెనీలకు పాసు పుస్తకాలు వారం రోజులు

ఆధార్ పెండింగ్ కేసులు వారం రోజులు

ఎన్ఆర్ఐలకు పాసు పుస్తకాల జారీ వారం రోజులు

పాసు పుస్తకంలో విస్తీర్ణం సవరణకు వారం రోజులు

ఎల్టీఆర్ కేసులు నెల రోజులు

పీఓబీ జాబితా సవరణ వారం రోజులు

సాదా బైనామాల పరిష్కారం మూడు నెలలు

ఇతర భూ సంబంధ కేసుల పరిష్కారం వారం రోజులు


Next Story

Most Viewed