పోటీ పడండి.. సాధించి చూపండి: పోలీసు సిబ్బందికి డీజీపీ పిలుపు

by Dishafeatures2 |
పోటీ పడండి.. సాధించి చూపండి: పోలీసు సిబ్బందికి డీజీపీ పిలుపు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే దేశంలోని అత్యుత్తమ పోలీస్​ స్టేషన్ ​పురస్కారాన్ని సాధించేందుకు రాష్ర్టంలోని అన్ని పోలీస్​స్టేషన్లు పోటీ పడాలని డీజీపీ అంజనీకుమార్​సూచించారు. ఈ అంశానికి సంబంధించిన సన్నద్దతపై అన్ని కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, గతంలో ఉత్తమ పోలీస్​స్టేషన్​పురస్కారాలు సాధించిన ఇన్స్​పెక్టర్లతో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. 2017లో పంజగుట్ట స్టేషన్​దేశం మొత్తం మీద రెండో స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా 2018లో రాచకొండ కమిషనరేట్​లోని నారాయణపూర్​స్టేషన్​13వ స్థానంలో నిలిచిందని చెప్పారు. 2019లో చొప్పదండి స్టేషన్​8వ, 2021లో జమ్మికుంట స్టేషన్​కు 10వ స్థానం లభించిందని వివరించారు. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో రాష్ట్రంలోని మెరుగైన పోలీసింగ్ విధానాలను అనుసరించి 30 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశామని తెలిపారు. వీటితోపాటు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా జాతీయ ఉత్తమ పోలీస్ స్టేషన్ పురస్కారాన్ని సాధించేందుకై పోటీ పడాలని అంజనీ కుమార్ తెలియ చేశారు.

సీసీటీఎన్ఎస్​డేటా ప్రాతిపదికగా దాదాపు 80 శాతం మార్కులు ఇస్తారని, మిగిలిన 20 శాతం మార్కులు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, పౌరుల ఫీడ్ బ్యాక్ నుండి ఉంటాయని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలు, మిస్సింగ్ పర్సన్స్, గుర్తు తెలియని మృత దేహాలు తదితర నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి నియమిత సమయంలోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని అన్నారు. ఈ అంశాలపై సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలతోపాటు ముఖ్యంగా డీ.ఎస్.పి లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ డీజీ షికా గోయల్ పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా ఉత్తమ పోలీస్ స్టేషన్ సాదించేందుకు చేపట్టాల్సిన పాయింట్లను తెలియ చేశారు. తానూ కరీంనగర్ సి.పి గా ఉన్నప్పుడు 2019 , 2020 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో చొప్పదండి, జమ్మికుంట పోలీస్ స్టేషన్లు ఎంపిక అవడానికి చేసిన ప్రత్యేక కృషిని ఐ.జి. కమలాసన్ రెడ్డి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్​లో సీఐడీ అదనపు డీజీ మహేశ్​భగవత్, రాచకొండ కమిషనర్​డీ.ఎస్.చౌహాన్, ఐజీలు చంద్రశేఖర్​రెడ్డి, షా నవాజ్​ఖాసీం పాల్గొన్నారు.



Next Story

Most Viewed